ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు

Published Fri, May 10 2024 1:30 PM

ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు

అమలాపురం రూరల్‌: ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో హింసారహితంగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. డబ్బు, మద్యం, డ్రగ్స్‌ వంటివి ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ రవాణా నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి బృందాలపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు సైలెంట్‌ ఫిరియడ్‌గా నిర్ధారించామని చెప్పారు.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని వాటిని నియంత్రించేందుకు మోడల్‌ కోడ్‌ బృందాల నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేకుండా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈసీఐ మార్గదర్శకాలను పాటిస్తూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులు కృషి చేయాలన్నారు. పోలింగ్‌ సమయంలో గుర్తించిన సమస్యాత్మక ఘటనలు, ఉల్లంఘనలను సాధారణ పరిశీలకులకు నివేదించాలని స్పష్టం చేశారు. మాక్‌ పోలింగ్‌ వేళ అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్‌ ఏజెంట్లు పక్కా ప్రణాళికతో 1,644 కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు. వాటిలో 563 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, 517 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. జిల్లావ్యాప్తంగా 15,31,410 మంది ఓటర్లు ఉన్నారని, అందరికీ ఓటరు స్లిప్పులు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లా లోని అమలాపురం పార్లమెంట్‌ స్థానానికి 15 మంది, 7 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొన్నారు.

991 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామని కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వెబ్‌ కాస్టింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించడానికి 991 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ కాస్టింగ్‌ చిత్రీకరించి కలెక్టరేట్‌కు అనుసంధానించి వీక్షించే విధంగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 563 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని వీటికి అదనంగా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మరో 428 పోలింగ్‌ కేంద్రాల్లో కూడా వెబ్‌ కాస్టింగ్‌ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎం.వెంకటేశ్వర్లు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ టి.వైద్యనాథ్‌శర్మ, ఏవో సీహెచ్‌ వీరాంజనేయప్రసాద్‌ పాల్గొన్నారు.

11వ తేదీ నుంచి పోలింగ్‌ రోజు వరకు 144వ సెక్షన్‌

పోలింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపుగా ఏర్పడకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలింగ్‌ ముగిసే ముందు 48 గంటలలోపు బహిరంగ సభలు, ఊరేగింపులు, అన్ని రకాల ప్రచారాలు నిషేధించామన్నారు.

Advertisement
 
Advertisement