#MIvsGT: ఊహించని షాక్‌.. హార్దిక్‌ రియాక్షన్‌ వైరల్‌! | Sakshi
Sakshi News home page

#Hardikpandya: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. హార్దిక్‌ ముఖం మాడింది!

Published Mon, Mar 25 2024 12:14 PM

IPL 2024: Umesh Won Battle Against Hardik Pandya Reaction Goes Viral - Sakshi

#Hardik Pandya Reaction After Loss Battle To Umesh Yadav: ఐపీఎల్‌-2024.. గుజరాత్‌ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్‌.. టాస్‌ గెలిచి.. ప్రత్యర్థిని 168 పరుగులకు కట్టడిచేసిన ముంబై ఇండియన్స్‌.. లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన.. ఆఖరి ఐదు ఓవర్లలో 43 పరుగులు కావాలి.. అప్పటికి ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. 

తిలక్‌ వర్మ నిలకడగా ఆడుతుండగా.. డెవాల్డ్‌ బ్రెవిస్‌ అప్పటికే జోరు మీదున్నాడు.. అతడి తర్వాత  టిమ్‌ డేవిడ్‌, హార్దిక్‌ పాండ్యా వంటి హిట్టర్లు కూడా ఉన్నారు. ఈ సమీకరణాలన్నీ చూసి ముంబై గెలుపు లాంఛనమే అనే అంచనాలు..

అయితే, పదహారో ఓవర్‌ ఐదో బంతి నుంచి ముంబై బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనం మొదలుపెట్టారు గుజరాత్‌ బౌలర్లు. మోహిత్‌ శర్మ బ్రెవిస్‌(46)ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. అనంతరం.. పద్దెనిమిదవ ఓవర్‌ ఆఖరి బాల్‌కు టిమ్‌ డేవిడ్‌(11)ను కూడా అవుట్‌ చేశాడు.

ఆ తర్వాతి రెండో బంతికే స్పెన్సర్‌ జాన్సన్‌ తిలక్‌ వర్మ(25)కు సెండాఫ్‌ ఇచ్చాడు. అనంతరం పందొమ్మిదో ఓవర్‌ చివరి బంతికి గెరాల్డ్‌ కొయెట్జీ(1)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి స్కోరు 150-7. ముంబై విజయానికి ఆరు బంతుల్లో 19 పరుగులు కావాలి. 

టిమ్‌ డేవిడ్‌ స్థానంలో క్రీజులోకి వచ్చి సింగిల్‌తో మొదలుపెట్టిన హార్దిక్‌ పాండ్యాపైనే ఆశలన్నీ! అందుకు తగ్గట్లుగానే ఆఖరి ఓవర్‌ వేసేందుకు వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌కు సిక్సర్‌తో ఆహ్వానం పలికాడు హార్దిక్‌. మరుసటి బంతికే ఫోర్‌ బాదాడు.

అప్పుడు సమీకరణం.. నాలుగు బంతుల్లో 9 పరుగులు.. కానీ హార్దిక్‌కు.. ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాకిచ్చాడు ఉమేశ్‌. పేసీ షార్ట్‌ బాల్‌తో పాండ్యాను బురిడీ కొట్టించి క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగేలా చేశాడు. దీంతో అహ్మదాబాద్‌ స్టేడియం మొత్తం ఉమేశ్‌ యాదవ్‌ వికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటూ హోరెత్తింది.

దెబ్బకు హార్దిక్‌ పాండ్యా ముఖం మాడిపోయింది. ఆ తర్వాతి బంతికి పీయూష్‌ చావ్లాను అవుట్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌ ముంబై గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఆఖరి బంతికి షమ్స్‌ ములానీ సింగిల్‌ తీసి ఇన్నింగ్స్‌ ముగించగా.. గుజరాత్‌ టైటాన్స్‌ ఆరు పరుగుల తేడాతో గెలిచి గెలుపుతో సీజన్‌ను ఆరంభించింది.

కాగా గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా ఉన్న హార్దిక్‌ పాండ్యా ఈసారి ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకే అహ్మదాబాద్‌ ప్రేక్షకులు ఆది నుంచే అతడిని ట్రోల్‌ చేస్తూ అరచి గోలగోల చేశారు. ఇలా హార్దిక్‌(4 బంతుల్లో 11 రన్స్‌) అవుట్‌ కావడం, ముంబై ఓడిపోవడంతో వారి సంబరాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: #HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! పక్కనే అంబానీ..

Advertisement

తప్పక చదవండి

Advertisement