ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల్లోపే మరో మెగా ఈవెంట్ క్రికెట్ ప్రేమికుల ముందుకు రానుంది. టీ20 ప్రపంచకప్-2024 రూపంలో మరోసారి పొట్టి ఫార్మాట్ మజాను అందించనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే భారత్ సహా మిగిలిన ప్రధాన దేశాల క్రికెట్ బోర్డులు జట్లను ప్రకటించాయి.
అప్పుడు సెమీస్‌లోనే
జూన్ 1 నుంచి ఆరంభం కానున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు అమెరికాతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తంగా 20 జట్లు పాల్గొననున్న ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. ఇప్పటికే ఎనిమిదిసార్లు పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌లో పాల్గొన్న హిట్‌మ్యాన్ రెండో దఫా కెప్టెన్ హోదాలో బరిలోకి దిగనున్నాడు.
గత ప్రపంచకప్-2022లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రోహిత్ సేన సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరుగగా ఇంగ్లిష్ జట్టు విజేతగా అవతరించింది. ఇక ఈసారి కూడా టీమిండియాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవే
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2024లో గట్టి పోటీనిచ్చే, టైటిల్ రేసులో నిలిచే జట్లు ఇవేనంటూ తన అంచనా తెలియజేశాడు.
‘‘ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. అలాగే ఆతిథ్య వెస్టిండీస్.. ఈ నాలుగు జట్లే మెగా ఈవెంట్లో కీలకంగా మారనున్నాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు. అయితే, ఈ లిస్టులో ఆయన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, గత ఎడిషన్ రన్నరప్ పాకిస్తాన్ పేర్లను విస్మరించడం గమనార్హం.
కాగా చిరకాల ప్రత్యర్థులు టీమిండియా- పాకిస్తాన్ గ్రూపు-ఏలో ఉన్నాయి. ఈ రెండు జట్లతో పాటు కెనడా, ఐర్లాండ్, యూఎస్‌ఏ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. ఇక జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 9న పాకిస్తాన్‌తో తలపడనుంది.
టీ20 ప్రపంచకప్-2024- ఏ గ్రూపులో ఏ జట్టు?
👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్‌ఏ
👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.
👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).
👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).
చదవండి: RCB vs CSK: చెన్నైని ఓడించినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరదు! అదెలా?.. మధ్యలో లక్నో!
Comments
Please login to add a commentAdd a comment