SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం! | Pat Cummins Comments After SRH Historic Win Against LSG, Says May Be Head Abhishek Changed Pitch Unreal | Sakshi
Sakshi News home page

Pat Cummins On SRH Win Vs LSG: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం.. నమ్మలేకపోతున్నా!

Published Thu, May 9 2024 8:37 AM

ప్యాట్‌ కమిన్స్‌ (PC: BCCI)

IPL 2024 SRH vs LSG: ఉప్పల్‌ స్టేడియంలో మరోసారి పరుగుల వరద పారింది. మ్యాచ్‌కు వాన గండం పొంచి ఉందంటూ అభిమానులు ఆందోళన పడిన వేళ.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి అసలైన టీ20 మజాను అందించారు సన్‌రైజర్స్‌ ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌.

తమ బ్యాటింగ్‌ విధ్వంసంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు కళ్లు తేలేసేలా చేసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించారు. రాహుల్‌ సేన పరుగులు చేసేందుకు తడబడిన పిచ్‌పై.. 166 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.

కనీవినీ ఎరుగని రీతిలో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ను గెలుపుతీరాలకు చేర్చారు. తమ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ఈ విజయాన్ని పుట్టినరోజు కానుకగా అందించారు. న భూతో న భవిష్యతి అన్న చందంగా ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోశారు అభిషేక్‌, హెడ్‌.

వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ప్యాట్ కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘బహుశా ట్రావిస్‌, అభిషేక్‌ కలిసి పిచ్‌ను మార్చేసి ఉంటారు(నవ్వుతూ). వాళ్లు ఏం చేయగలరో మాకు తెలుసు. అందుకే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.

నిజానికి నేనొక బౌలర్‌ను. కాబట్టి ఆ బ్యాటర్లకు పెద్దగా ఇన్‌పుట్స్‌ ఇవ్వలేను. ట్రావిస్‌ హెడ్‌ విషయానికొస్తే.. అతడు గత రెండేళ్లుగా ఇలాగే ఆడుతున్నాడు.

అతడొక అద్భుతం
కఠినమైన పిచ్‌లపై కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక అభిషేక్‌ శర్మ.. అతడొక అద్భుతమైన ఆటగాడు. స్పిన్‌, పేస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.

పవర్‌ ప్లేలో వీళ్లిద్దరిని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. ఈ సీజన్‌లో మా వాళ్లు సూపర్‌గా ఆడుతున్నారు. అయితే, పది కంటే తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించడం నమ్మలేకపోతున్నాం’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు.

10 వికెట్ల తేడాతో గెలుపు
కాగా లక్నోతో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. భువనేశ్వర్‌ కుమార్‌(2/12)కు తోడు ఫీల్డర్లు అద్భుతంగా రాణించడంతో  లక్నోను 165/4 స్కోరుకు కట్టడి చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌.. ఓపెనర్లు‌ అభిషేక్‌ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ట్రావిస్‌ హెడ్‌(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసులో మరో ముందడుగు వేసింది.‌‌

 

Advertisement

తప్పక చదవండి

Advertisement