"శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లోపల గుడి గోపురంబులు సభాస్థలులైనవి. కొండముచ్చు గుంపులకు చరిత్రలో మునిగిపోయిన దాంధ్ర వసుందరాధి పోజ్వల విజయ ప్రతాప రభసంబొక స్వప్న కథా విశేషమై" ! ( హంపీక్షేత్రం కొడాలి & కామరాజుగడ్డ ) నేను శిక్షణలో భాగంగా బెంగుళూరు వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి పనిగట్టుకొని హంపీ, బేలూరు, హలబెలిలకు వెళ్లి అలనాటి విజయనగర సామ్రాజ్య గతవైభవ శిథిలాలను చూసినప్పుడు నా మనసులో మెదిలిన పద్యం ఇది.
అమెరికా లాస్ ఏంజెల్స్ వెళ్ళినప్పుడు, హాలీవుడ్ బొలివెర్డ్ లోనున్న ‘ మేడం టుస్సాడ్ వాక్స్ మ్యూజియం ’ చూశాం. అప్పుడు పదేపదే నాకు జ్ఞాపకం వచ్చింది ఈ పద్యమే. మూడు అంతస్తుల్లో ఉన్న ఈ మ్యూజియం 2009 లో ప్రారంభమైందట. దీని ముందున్న కింగ్ కాంగ్ పెద్ద ఆకృతి ప్రధాన ఆకర్షణ. ఇందులో ప్రదర్శించబడిన మైకేల్ జాక్సన్, మార్లిన్ మన్రో , చార్లీ చాప్లిన్, బ్రూస్ లీ, బారక్ ఒబామా వంటి ఎంతోమంది ప్రముఖుల రూపాలను చూసినప్పుడు వాటిని సజీవమూర్తులా అన్నట్లుగా తయారుచేసి పెట్టిన కళాకారుల ప్రతిభాసామర్థ్యాలు మమ్మల్ని ముగ్దులను చేశాయి. అయితే అప్పట్లో అందులో నాకు ఇండియా వాళ్ళది ఒక్క బొమ్మ కూడా కనిపించలేదు. ఈ వాక్స్ కళను మ్యూజియం స్థాయికి అభివృద్ధి చేసిన మేడం, ఫ్రాన్స్‌కు చెందిన మేరీ టుస్సాడ్ ( 1761 - 1850 ) మూర్తికి చేతులెత్తి మొక్కాము.
ఇప్పుడు మేడం టుస్సాడ్ & సన్స్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీరు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి మ్యూజియంలను స్థాపించి ,అందులో సినిమా నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల మూర్తులను పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూపోతున్నారు. నిజమే కానీ ఇవన్నీ ఉత్త మైనపు బొమ్మలు మాత్రమేనన్న విషయం మనం మరిచిపోవద్దు. వీటితో పోల్చినప్పుడు కఠిన శిలలను శిల్పాలుగా, దేవతా మూర్తులుగా, మలిచిన మన శిల్పుల గొప్పదనం అర్థమౌతుంది. ఎన్నో కాలపరీక్షలను తట్టుకొని వేలవేల సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ నిలిచివున్న మన అపురూప కళాఖండాల విలువ తెలుస్తుంది.
ప్రతి సంవత్సరం మట్టితో భిన్న భిన్న ఆకృతుల వినాయక విగ్రహాలు చేసి అమ్ముకుంటున్న మన కళాకారుల వ్యాపారమంతా ఇప్పటికీ సరియైన ఆదరణ లేక రోడ్ల మీదనే కదా జరుగుతుంది. బ్రిటిషర్స్ పరాయి పాలకులైనా, భిన్న మతస్తులైన భారతదేశ చరిత్ర, సంస్కృతికి సాక్ష్యాలైన మన శిల్ప, శాసన సంపత్తిని చాలావరకు కాపాడగలిగారు. అపాటి కృషి స్వతంత్ర భారతంలో కూడా జరుగలేదన్నది చేదునిజం.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎంతో అమూల్యమైన మన ప్రాచీన శిల్పసంపద సరియైన ఆదరణకు నోచుకోకుండా శిథిలమై కాలగర్భంలో కలిసిపోతుండడం విచారకరం. వీటిని కాపాడి ఎన్ని మ్యూజియంలైనా పెట్టవచ్చు. ప్రకృతివిపత్తులు, బయటివారి దండయాత్రలు, దేశ అంతర్గత మతబేధాల వల్ల మనం ఎంతో శిల్ప సంపదను కోల్పోయింది వాస్తవం . ఇప్పుడు ఉన్నదాన్నైనా కాపాడుకోలేక పొతే, మ్యూజియంల వంటి వాటిలో పరిరక్షించుకోలేకపోలే భావితరాలు మనల్ని క్షమించవన్న భావన నాకు మేడం టుస్సాడ్ మ్యూజియం సందర్శన ప్రేరణగా కలిగింది !
వేముల ప్రభాకర్
(చదవండి: US : చర్మం రంగు.. కోటి తిప్పలు!)
Comments
Please login to add a commentAdd a comment