శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ఆయన ఈ మధ్య ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మనది చాలా వైవిద్యమున్న దేశం, ఇక్కడ దక్షిణాదివాళ్ళు ఆఫ్రికన్లలా, ఉత్తరాదివాళ్లు శ్వేతజాతీయుల్లా, తూర్పువాళ్ళు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల్లా కనబడుతారు, అయినా మనమంతా ఒక్కటే! అన్నాడు. ఆయన మాటల్లో తప్పుందా? లేదా అన్నది పక్కనబెడితే ఆర్య, ద్రావిడ అంతరాల చర్చ మనకు కొత్తేమి కాదు. కానీ ఇది ఎన్నికల సమయం కావడంతో రాజకీయ పార్టీల మధ్య అదో వివాదాస్పద విషయం అయింది. అమెరికాలో భారత సంతతి వారిని మామూలుగానైతే బ్రౌన్స్( Wheatish ) అంటే గోధుమవర్ణం కలవారని అంటుంటారు.
అంతమాత్రాన ఒక ఉప ఖండమంత ఈ దేశంలో ఉన్నవారందరూ అదే రంగు కలవారు కాదు కదా! ఈ గోధుమ వర్ణం చాలావరకు ఉత్తరాది వాళ్లకు వర్తిస్తుంది, దక్షిణాదిలో నలుపు వర్ణస్తులే ఎక్కువ. తెలుపు పాశ్చాత్యుల రంగు. అమెరికాలోని 70 శాతానికి పైగా ప్రజలు కాకేసియన్ (యూరోపియన్) జాతివారు, మిగతా 30 శాతంలో లాటినో, ఆఫ్రికా అమెరికన్స్, ఆసియన్స్ వారి రంగు, రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి. అయితే చాలామంది ముఖ్యంగా స్త్రీలు ఏ దేశస్తులైనా వారికి జన్మతో సహజంగా వచ్చిన శరీర వర్ణంపై, అందంపై అంతగా తృప్తి ఉన్నట్లు కనబడదు. భారత్‌లో పసుపు, కుంకుమ, కాటుకలే గొప్ప సౌందర్య సాధనాలు, మధ్యకాలంలో వచ్చినవి స్నోలు, పౌడర్లు, ఇప్పుడైతే లెక్కకు మిక్కిలి.
రంగు పెంచుకునే పాట్లు..
అమెరికాలో నల్లవారైతే కాస్త తెల్లగా కనబడాలని, బ్రౌన్ కలర్ వున్నవారు కొంత తెల్లబడాలని, పూర్తి తెల్లవారు ఆ కలర్ కాస్త తగ్గితే బాగుండునని, ఉన్న శరీర వర్ణ సౌష్టవాన్ని మరింత పెంచుకోవాలని అందుకు శతప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల సౌందర్య తృష్ణ ఫలితంగా అక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరుగుతున్న బ్యూటీ సెలూన్లు, పార్లర్లు, క్లినిక్‌లు, జిమ్‌లు, స్పాలు, మసాజ్, ట్యానింగ్ ( చర్మశుద్ధి ), బ్లీచింగ్ ( చర్మాన్ని తెల్లబరచడం ) బాడీ టోనింగ్ ( కండరాల వృద్ధి), హెయిర్ టోనర్ వగైరా సెంటర్లు నడుస్తున్నాయి. నేను అమెరికా వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక సముద్రతీర సందర్శన ఉండనే ఉంటుంది. అలా ఏ రాష్ట్రంలోని ఏ బీచ్ కు వెళ్లినా ‘ సన్ బాత్ ’ చేసే స్త్రీ పురుషులతో అవి కిటకిట లాడడం గమనించాను.
సూర్య స్నానాలు
వీటివల్ల సూర్యకాంతి సోకి చర్మశుద్ధి అవుతుంది, చర్మంలో మార్పు వస్తుంది, శరీరానికి విటమిన్ డి లభిస్తుంది, ఎముకలు ధృడమౌతాయి, మనిషిలోని ఒత్తిడి తగ్గుతుంది, మంచినిద్ర కూడా వస్తుందంటారు. కానీ ఇలాంటి ‘సూర్య స్నానాలు’ సూర్యోదయం నుండి ఉదయం 10 గంటల వరకు పర్వాలేదు, ఆ తర్వాత సాయంత్రం ముందు వరకు సూర్యుని నుండి సోకే యూఏబి కిరణాలవల్ల చర్మ క్యాన్సర్ ప్రమాదం ఉందన్నది డాక్టర్ల హెచ్చరిక. ఎందుకొచ్చిన ‘అవుట్ డోర్ ట్యానింగ్’ అనుకునే వారికోసం ప్రత్యామ్నాయంగా వచ్చినవి, అమెరికన్ మహిళల ఫ్యాషన్ అయినవి ‘ఇండోర్ ఆర్టిఫిషల్ అల్ట్రా వయలెట్ సెంటర్లు .
ఇందులో అతి నీలలోహిత వికిరణాలను విడుదలచేసే పరికరాలు, ట్యానింగ్ లేదా సన్ బెడ్స్ ఉంటాయి. ఇక్కడ చర్మానికి హాని చేయని విధంగా కృత్రిమ కాంతిని నియంత్రిత పద్దతిలో వాడి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ చికిత్స 16-25 సంవత్సరాల వయసులో ఉన్నవారికేనట. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు వున్నవారికి కూడా ఈ చర్మశుద్ధి చికిత్సలు ఉపయోగపడుతున్నాయంటున్నారు.
ఇలా ట్యానింగ్ వల్ల వచ్చిన కలర్ శాశ్వతం మాత్రం కాదు సుమా! ప్రపంచం లోనే స్వీడెన్ దేశ స్త్రీలు అందమైన వారు అంటారు, భారత్ లో హిమాచల్, జమ్మూ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్ మహిళల గురించి చెబుతారు. ఎవరి వర్ణం గొప్ప , అతిలోక సుందరులు ఎవరు? అంటే అది చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యవంతులు, ఉన్నంతలో తృప్తిగా, ఆనందంగా ఉండేవారే అందమైనవారు అనడం సమంజసంగా ఉంటుంది !
వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment