IPL 2024: పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా భయం అదే! | Sakshi
Sakshi News home page

IPL 2024: పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా భయం అదే!

Published Thu, Apr 18 2024 2:30 PM

Nothing To Learn From Playing In IPL: Cricket Board Official Blunt Remark On CSK Star Why - Sakshi

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ గురించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఆపరేషన్స్‌ చైర్మన్‌ జలాల్‌ యూనస్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ సేవలను వందకు వంద శాతం ఉపయోగించుకోవాలని సీఎస్‌కే భావిస్తోందని.. దాని వల్ల తాము నష్టపోయే పరిస్థితి వస్తుందన్నాడు.

అదే విధంగా.. ఇప్పటికే ముస్తాఫిజుర్‌ తానేంటో అంతర్జాతీయ స్థాయిలో నిరూపించుకున్నాడని.. అతడు కొత్త ఐపీఎల్‌లో కొత్త నేర్చుకునేది ఏమీ లేదని యూసన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌-2024 మినీ వేలంలో భాగంగా సీఎస్‌కే రూ. 2 కోట్ల కనీస ధరకు బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ను కొనుగోలు చేసింది.

ఫ్రాంఛైజీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ముస్తాఫిజుర్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు తీశాడు. చెన్నై విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌కు కేవలం మే 1 వరకే ఐపీఎల్‌లో ఆడేలా నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(నో ఆబ్జక్షన్‌ సర్టిఫికెట్‌) జారీ చేసింది. జింబాబ్వేతో సిరీస్‌ నాటికి తిరిగి రావాలని నిబంధన విధించింది.

అయితే, సీఎస్‌కే మాత్రం ఒకరోజు గడువు పొడిగించాలని విజ​ప్తి చేసింది. మే 1న పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం అతడిని రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్లు బీసీబీకి ప్రతిపాదనలు పంపింది. ఇందుకు బీసీబీ అంగీకరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో యూనస్‌ బంగ్లా మీడియా ‘డైలీ స్టార్‌’తో మాట్లాడుతూ.. ‘‘మే 1 వరకు ముస్తాఫిజుర్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించాం. అతడు మే 2న తిరిగి వస్తాడు. ఆ మరుసటి రోజు నుంచి అతడు బంగ్లా జట్టుకు అందుబాటులో ఉంటాడు.

అయినా.. ముస్తాఫిజుర్‌ ఐపీఎల్‌లో ఆడటం ద్వారా కొత్తగా నేర్చుకునేది ఏమీ ఉండదు. అతడు నేర్చుకునే దశ పూర్తైంది. నిజానికి చాలా మంది అతడిని చూసే నేర్చుకుంటున్నారు. ఐపీఎల్‌లో ఆడించడం ద్వారా బంగ్లాదేశ్‌కు ఒరిగేదేమీ లేదు.

పీల్చి పిప్పిచేయాలని చూస్తున్నారు.. మా బాధ మాది!
మా ఆందోళనంతా ముస్తాఫిజుర్‌ ఫిట్‌నెస్‌ గురించే! వాళ్లు అతడి నుంచి 100 శాతం ఎఫర్ట్‌ రాబట్టాలని చూస్తున్నారు. అతడి ఫిట్‌నెస్‌ గురించి వాళ్లకెందుకు పట్టింపు ఉంటుంది. మాకు మాత్రం అతడు ముఖ్యం. అందుకే తనని వెనక్కి రప్పిస్తున్నాం.

కేవలం జింబాబ్వేతో సిరీస్‌లో ఆడేందుకే కాదు.. అతడిపై పనిభారం తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. కాగా యూనస్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఐపీఎల్‌లో తమ ఆటగాడిని వాడుకుంటున్నారని బాధపడే బదులు అతడిని మొత్తానికే పంపకుండా ఉండే బాగుండేదని యూనస్‌కు చురకలు అంటిస్తున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్‌. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో డబ్బు కోసమే అందరూ ఆడతారని.. అలాంటపుడు వేలంలోకి రాకుండా ముస్తాఫిజుర్‌ను ఆపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు.‍ కాగా మే 3 - 12 వరకు బంగ్లాదేశ్‌ స్వదేశంలో జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement