NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్‌.. కుప్పకూలిన కివీస్‌! కానీ.. | Sakshi
Sakshi News home page

NZ vs AUS: చెలరేగిన హాజిల్‌వుడ్‌.. కుప్పకూలిన కివీస్‌! కానీ..

Published Fri, Mar 8 2024 12:56 PM

NZ vs AUS 2nd Test: Australia Dampen New Zealand Milestone Celebrations But - Sakshi

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. కంగారూ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ దెబ్బకు కివీస్‌ బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరు కూడా కనీసం నలభై పరుగుల మార్కు అందుకోలేకపోయారు.

కాగా న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా 172 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే ఉద్దేశంతో కివీస్‌ బరిలోకి దిగింది. అయితే, తొలిరోజే ఆసీస్‌ చేతిలో ఆతిథ్య జట్టుకు చేదు అనుభవం ఎదురైంది.

బ్యాటర్లంతా కలిసికట్టుగా విఫలం కావడంతో 162 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ 38 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. లోయర్‌ ఆర్డర్‌లో మ్యాట్‌ హెన్రీ 29 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

మిగతా వాళ్లలో వికెట​ కీపర్‌ టామ్‌ బ్లండెల్‌(22), కెప్టెన్‌ టిమ్‌ సౌథీ(26) మాత్రమే 20 పరుగుల మార్కు దాటగలిగారు. ఆసీస్‌ పేసర్లు జోష్‌ హాజిల్‌వుడ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. మిచెల్‌ స్టార్క్‌ మూడు, ప్యాట్‌ కమిన్స్‌, కామెరాన్‌ గ్రీన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాకిచ్చాడు కివీస్‌ పేసర్‌ బెన్‌ సీర్స్‌. ఓపెనర్‌ స్టీవ్‌ స్మిత్‌(11)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని తొలి వికెట్‌ పడగొట్టాడు. 

అనంతరం మరో ఫాస్ట్‌బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ ఉస్మాన్‌ ఖవాజా(16), కామెరాన్‌ గ్రీన్‌(25), ట్రవిస్‌ హెడ్‌(21)ల రూపంలో మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసే సరికి ఆసీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ 45, నాథన్‌ లియోన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ స్టార్లు కేన్‌ విలియమ్సన్‌, టిమ్‌ సౌతీలకు వందో టెస్టు కావడం విశేషం.

 

Advertisement
 
Advertisement