Shikhar Dhawan likely to lead India at Asian Games 2023, VVS Laxman to coach - Sakshi
Sakshi News home page

Team India Captain: ఆర్నెళ్లుగా జట్టుకు దూరం.. ఏకంగా టీమిండియా కెప్టెన్‌గా రీఎంట్రీ! కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌..

Published Fri, Jun 30 2023 11:23 AM

Shikhar Dhawan To Lead India VVS Laxman To Coach Check Full Details - Sakshi

గతేడాది డిసెంబరులో ఆఖరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఛట్టోగ్రామ్‌ వేదికగా కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత గబ్బర్‌కు జట్టులో చోటు కరువైంది.

మెరుగైన ప్రదర్శన
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2023లో పంజాబ్‌ కింగ్స్‌ సారథిగా అవతారమెత్తిన శిఖర్‌ ధావన్‌.. బ్యాటర్‌గా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 373 పరుగులు సాధించాడు. ఈ సీజన్‌లో అతడి అత్యధిక స్కోరు 99 నాటౌట్‌. 

అయితే, బ్యాటర్‌గా సఫలమైనప్పటికీ కెప్టెన్‌గా గబ్బర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అడపా దడపా టీమిండియా సారథిగా వ్యవహరించిన అతడు.. ఐపీఎల్‌లో పంజాబ్‌ను కనీసం టాప్‌-5లో కూడా నిలపలేకపోయాడు. ఐపీఎల్‌ పదహారో ఎడిషన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో పంజాబ్‌ కేవలం ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఆర్నెళ్లుగా జట్టుకు దూరం
ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరమైన శిఖర్‌ ధావన్‌ ఈసారి ఏకంగా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో జరుగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు అతడు సారథిగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

ధావన్‌ నేతృత్వంలో ద్వితీయశ్రేణి జట్టు హాంగ్జూకు వెళ్లనున్నట్లు సమాచారం. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కెప్టెన్‌గా రీఎంట్రీ!
ప్రధాన జట్టు ప్రపంచకప్‌ సన్నాహకాల్లో ఉండనున్న తరుణంలో.. సెప్టెంబరు 23- అక్టోబరు 8 వరకు నిర్వహించనున్న ఆసియా క్రీడలకు బీ-టీమ్‌ను పంపే యోచనలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ జట్టుకు కెప్టెన్‌ ధావన్‌, హెడ్‌కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యవహరించనున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. ఇదిలా ఉంటే.. టీమిండియా జూలై 12 - ఆగష్టు 13 వరకు వెస్టిండీస్‌ పర్యటనలో గడుపనుంది.

చదవండి: WC 2023: వెస్టిండీస్‌ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే! 
టీమిండియాతో టెస్టులకు సై.. కెప్టెన్‌గా బ్రాత్‌వైట్‌.. వాళ్లంతా జట్టుకు దూరం

Advertisement
Advertisement