India Vs Australia Highlights, 3rd Test Day 2: Nathan Lyon Scalps 8, IND All-Out For 163 As AUS Need 76 To Win - Sakshi
Sakshi News home page

‘లయన్‌’ పంజా

Published Fri, Mar 3 2023 2:17 AM

Team India 163 all out in the second innings - Sakshi

మన స్పిన్‌ కోటలో ప్రత్యర్థి బాగా పాగా వేసింది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా పాచిక పారుతుంటే... ఆతిథ్య వేదికపై భారత్‌ వణుకుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కంటే కాస్త ఎక్కువ స్కోరు చేసిందేమో కానీ... నాథన్‌ లయన్‌ (23.3–1–64–8) గర్జనకు తలవంచింది. వికెట్లు రాలిన తీరుతో భారత శిబిరం బిక్కమొహమేసింది. 76 పరుగుల అత్యల్ప లక్ష్యం ఆసీస్‌ ముందుండగా... మూడో రోజు తొలి సెషన్‌లోనే మూడో టెస్టు ముగిసే అవకాశముంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టూ 76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగి ఓడిపోయిన  దాఖలాలు లేవు.

ఇండోర్‌: ఈ సిరీస్‌లో స్పిన్‌తో గెలిచిన భారత్‌ ఇప్పుడదే స్పిన్‌కు ఉక్కిరిబిక్కిరవుతోంది. తిప్పేసే చోటే (పిచ్‌) బొక్కబోర్లా పడుతోంది. ఒక ఇన్నింగ్స్‌ అంటే ఏమో అనుకోవచ్చు... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మన పిచ్‌పై మన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో టీమిండియా పరాజయం అంచున నిలిచింది. మూడో టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసేందుకు సిద్ధమైంది. వికెట్ల పతనంలో రెండో రోజు (16 వికెట్లు) మొదటి రోజు (14)ను మించింది.

మూడో రోజు పర్యాటక ఆ్రస్టేలియా ముందు కేవలం 76 పరుగుల లక్ష్యమే ముందుండగా... స్పిన్‌ బంతులు బొంగరంలా తిరుగుతున్న పిచ్‌పై భారత్‌లో ఏ మూలనో ఆశలు రేపుతోంది. 75 పరుగుల్లోపే 10 వికెట్లు తీస్తే మాత్రం ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు కాదు పిచ్‌నే ‘టర్నింగ్‌’ విన్నర్‌ అవుతుంది. రెండో రోజు ఆటలో ముందుగా ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌ 76.3 ఓవర్లలో 197 పరుగుల వద్ద ముగిసింది. పర్యాటక జట్టుకు 88 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య భారత్‌  60.3 ఓవర్లలో 163 పరుగులకే  కుప్పకూలింది. 

11 పరుగులు... 6 వికెట్లు... 
ఓవర్‌నైట్‌ స్కోరు 156/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆ్రస్టేలియా ఉదయం గంటకుపైగా బాగానే ఆడింది. హ్యాండ్స్‌కాంబ్‌ (19; 1 ఫోర్‌), కామెరాన్‌ గ్రీన్‌ (21; 2 ఫోర్లు) జోడీ 17 ఓవర్లపాటు భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంది. ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటేలా కనిపించింది.

అయితే  186 పరుగుల వద్ద హ్యాండ్స్‌కాంబ్, మరుసటి ఓవర్లో గ్రీన్‌ అవుట్‌ కాగానే ఆసీస్‌ అనూహ్యంగా 11 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లను కోల్పోయింది. 200 స్కోరుకు ముందే 197 పరుగుల వద్దే ఆలౌటైంది. పేస్‌తో ఉమేశ్‌ (3/12), స్పిన్‌తో అశ్విన్‌ (3/44) రె చ్చిపోయారు. ఆరు వికెట్లను వీరిద్దరు పంచుకొని ప్రత్యర్థిని పడగొట్టేశారు.  

లయన్‌ గర్జన 
ఆస్ట్రేలియాను అద్భుతంగా కట్టడి చేయడంతో ఇక జాగ్రత్తగా ఆడితే ఈ మ్యాచ్‌లో భారత్‌ గట్టెక్కుతుందని అంతా భావించారు. కానీ భారత్‌ రెండో ఇన్నింగ్స్‌పై లయన్‌ గర్జనకు చక్కని ఫీల్డింగ్‌ కూడా తోడు కావడంతో ఆ్రస్టేలియానే పైచేయి సాధించింది. ఓపెనర్లు రోహిత్‌ (33 బంతుల్లో 12), శుబ్‌మన్‌ (15 బంతుల్లో 5)లకు ఒక్క బౌండరీ అయిన కొట్టే అవకాశం ఇవ్వకుండా లయన్‌ ఇద్దరి పని పట్టాడు. కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) వచ్చి ఫోర్లు కొడుతున్నాడులే అనే ఆనందాన్ని కునెమన్‌ దూరం చేశాడు.

54 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పెవిలియన్‌లో కూర్చున్నాయి. ప్రధాన వికెట్లే లయన్‌ ఉచ్చులో పడినా... పుజారా (142 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జోడీ ఉన్నంత సేపూ జట్టు ధీమాగానే ఉంది. స్టార్క్‌ బౌలింగ్‌లో ఖాజా కళ్లు చెదిరే క్యాచ్‌కు అయ్యర్‌ ఆట ముగియగా జట్టు పతనం మొదలైంది.

శ్రీకర్‌ భరత్‌ (3) మళ్లీ నిరాశపరచగా... స్మిత్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌కు పుజారా ఇన్నింగ్స్‌ కూడా ముగిసింది. అశ్విన్‌ (16; 2 ఫోర్లు), అక్షర్‌ (15 నాటౌట్‌; 1 సిక్స్‌) రెండంకెల స్కోర్లు చేశారు. లయన్‌ 8, స్టార్క్, కునెమన్‌ చెరో వికెట్‌ తీశారు. 

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 109;
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: హెడ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 9; ఖాజా (సి) గిల్‌ (బి) జడేజా 60; లబుషేన్‌ (బి) జడేజా 31; స్మిత్‌ (సి) భరత్‌ (బి) జడేజా 26; హ్యాండ్స్‌కాంబ్‌ (సి) అయ్యర్‌ (బి) అశ్విన్‌ 19; గ్రీన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్‌ 21; క్యారీ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్‌ 3; స్టార్క్‌ (బి) ఉమేశ్‌ 1; లయన్‌ (బి) అశ్విన్‌ 5; మర్ఫీ (బి) ఉమేశ్‌ 0; కునెమన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (76.3 ఓవర్లలో ఆలౌట్‌) 197.
వికెట్ల పతనం: 1–12, 2–108, 3–125, 4–146, 5–186, 6–188, 7– 192, 8–196, 9–197, 10–197. బౌలింగ్‌: అశ్విన్‌ 20.3–4–44–3, జడేజా 32–8–78–4, అక్షర్‌ 13– 1–33–0, ఉమేశ్‌ 5–0–12–3, సిరాజ్‌ 6–1– 13–0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్‌ 12; గిల్‌ (బి) లయన్‌ 5; పుజారా (సి) స్మిత్‌ (బి) లయన్‌ 59; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) కునెమన్‌ 13; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్‌ 7; అయ్యర్‌ (సి) ఖాజా (బి) స్టార్క్‌ 26; భరత్‌ (బి) లయన్‌ 3; అశ్విన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్‌ 16; అక్షర్‌ (నాటౌట్‌) 15; ఉమేశ్‌ (సి) గ్రీన్‌ (బి) లయన్‌ 0; సిరాజ్‌ (బి) లయన్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (60.3 ఓవర్లలో ఆలౌట్‌) 163. వికెట్ల పతనం: 1–15, 2–32, 3–54, 4–78, 5–113, 6–118, 7–140, 8–155, 9–155, 10–163. బౌలింగ్‌: స్టార్క్‌ 7–1–14–1, కునెమన్‌ 16–2–60–1, నాథన్‌ లయన్‌ 23.3–1–64–8, మర్ఫీ 14–6–18–0.  

Advertisement
 
Advertisement
 
Advertisement