T20 World Cup 2024: అదే జరిగితే పాక్‌ క్వాలిఫయర్స్‌ ఆడక తప్పదు..! | T20 World Cup 2024: If Pakistan Cannot Qualify For Super 8, Then It May Have To Play Qualifiers For T20 World Cup 2026 | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: అదే జరిగితే పాక్‌ క్వాలిఫయర్స్‌ ఆడక తప్పదు..!

Published Sun, Jun 9 2024 7:07 PM | Last Updated on Sun, Jun 9 2024 7:28 PM

T20 World Cup 2024: If Pakistan Cannot Qualify For Super 8, Then It May Have To Play Qualifiers For T20 World Cup 2026

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దాయాది పాకిస్తాన్‌ గడ్డుకాలం​ ఎదుర్కొంటుంది. పసికూన యూఎస్‌ఏతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఫలితంగా గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-8కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ పాక్‌ సూపర్‌-8కు చేరకుండా నిష్క్రమిస్తే మరింత హీన స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

పొట్టి ప్రపంచకప్‌ తదుపరి ఎడిషన్‌కు (2026) అర్హత సాధించాలంటే క్వాలిఫయర్స్‌ ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ సభ్య దేశమైన పాకిస్తాన్‌ గతంలో ఎప్పుడూ క్వాలిఫయర్స్‌ ఆడలేదు. ఒకవేళ ఇదే జరిగితే ఆ జట్టుకు ఘోర అవమానం జరిగినట్లవుతుంది. ఈ ప్రపంచకప్‌లో పాక్‌ సూపర్‌-8కు చేరాలంటే ఇవాళ (జూన్‌ 9) భారత్‌తో జరుగబోయే మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ (గ్రూప్‌ దశలో) గెలవాల్సి ఉంటుంది. 

ఇలా జరిగినా పాక్‌ సూపర్‌-8కు చేరుతుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే యూఎస్‌ఏ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌-ఏ నుంచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్‌.. ఐర్లాండ్‌పై విక్టరీతో రెండో స్థానంలో ఉంది. యూఎస్‌ఏ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా సూపర్‌-8కు చేరుకోనుండగా.. భారత్‌ పాక్‌తో మ్యాచ్‌లో ఓడినా ఆడాల్సిన మిగతా రెండు మ్యాచ్‌ల్లో (యూఎస్‌ఏ, కెనడా) గెలిస్తే సూపర్‌-8కు అర్హత సాధిస్తుంది. ఇలా ఏ లెక్కన చూసినా పాక్‌ ఈ ప్రపంచకప్‌లో సూపర్‌-8కు అర్హత సాధించడం అసాధ్యంగా కనిపిస్తుంది. 

పాక్‌ ఇక్కడ సూపర్‌-8కు చేరుకోకపోతే 2026 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో తప్పక పోటీపడాల్సి ఉంది. ఐసీసీ సవరించిన నిబంధనల ప్రకారం ఈసారి ప్రపంచకప్‌లో సూపర్‌-8 అర్హత సాధించిన జట్లే వచ్చే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. గతంలో ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించడం టీ20 ర్యాంకింగ్స్‌పై ఆధారపడి ఉండేది. ఐసీసీ 2026 ప్రపంచకప్‌ నుంచి ఈ నిబంధనను సవరించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది.  

ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఇవాళ (జూన్‌ 9) దాయాదుల సమరం జరుగనుంది. న్యూయార్క్‌ వేదికగా జరుగనున్న ఈ మెగా ఫైట్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్‌ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతే ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement