టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ (జూన్ 9) మహాసంగ్రామం జరగాల్సి ఉంది. న్యూయార్క్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అయితే ఈ బిగ్ ఫైట్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాడు.
మ్యాచ్ ప్రారంభ సమయానికి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు న్యూయార్క్ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా టాస్ కూడా నిర్ణీత సమయంలో పడకపోవచ్చని అంచనా. అయితే సమయం గడిచే కొద్ది వరుణుడు శాంతించవచ్చని సమాచారం. ఒకవేళ వరుణుడు మ్యాచ్ ప్రారంభానికి ఆటంకం కలిగించినా ఓవర్ల కుదింపుతో మ్యాచ్ సాధ్యపడే అవకాశం ఉంది.
మ్యాచ్ ప్రారంభానికి రెండున్నర గంటల ముందు అక్కడి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్, పాక్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది.
మరోపక్క ఈ మ్యాచ్‌కు కేటాయించబడిన పిచ్ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ డ్రాప్ ఇన్ వికెట్ క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. అనూహ్య బౌన్స్ కారణంగా బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్ల పాలిట ఈ పిచ్ సింహస్వప్నంలా మారింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 100కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment