BCCI Central Contracts: ఆ నలుగురి ఖేల్‌ ఖతమైనట్లేనా..? | BCCI Annual Contracts 2023-24: Team India Veterans Pujara, Shikhar Dhawan, Umesh Yadav Lost Their BCCI Central Contracts - Sakshi
Sakshi News home page

BCCI Annual Central Contracts Details: ఆ నలుగురి ఖేల్‌ ఖతమైనట్లేనా..?

Published Wed, Feb 28 2024 9:53 PM

Team India Veterans Pujara, Shikhar Dhawan, Umesh Yadav Lost Their BCCI Central Contracts - Sakshi

2023-24 సంవత్సరానికి గాను బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్‌ చతేశ్వర్‌ పుజారా, శిఖర్‌ ధవన్‌, ఉమేశ్‌ యాదవ్‌ చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ, ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ‍ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్‌ దేశవాలీ క్రికెట్‌లో అడపాదడపా దర్శనమిస్తున్నాడు. 

శిఖర్‌ అయితే మొత్తానికే క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కేవలం ఐపీఎల్‌ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్‌ అజింక్య
రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు. రహానే రంజీల్లో పూర్తి స్థాయిలో ఆడుతున్నప్పటికీ.. అతని నుంచి చొప్పుకోదగ్గ ఒ‍క్క ఇన్నింగ్స్‌ కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక బీసీసీఐ అతన్ని పక్కకు పెట్టి ఉంటుంది.

 

ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోతే వీరి కెరీర్‌లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్‌ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య చాంతాండంత ఉంది. వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. పై పేర్కొన్న నలుగురితో పాటు సరైన అవకాశాలు రాని చహల్‌, దీపక్‌ హుడాలపై కూడా బీసీసీఐ వేటు వేసింది

తాజాగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్ల విషయానికొస్తే.. 

  • ఏ ప్లస్‌ కేటగిరిలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా..
  • ఏ కేటగిరిలో అశ్విన్‌, షమీ, సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా..
  • బి కేటగిరిలో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌..
  • సి కేటగిరిలో రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శార్దూల్ ఠాకూర్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముఖేష్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. 

కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సిరాజ్‌లకు బి నుంచి ఏ కేటగిరికి ప్రమోషన్‌ లభించగా.. అక్షర్‌ పటేల్‌, రిషబ్‌ పంత్‌లకు ఏ నుంచి బి కేటగిరికి డిమోషన్‌ వచ్చింది. ఇటీవలికాలంలో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ , అవేశ్‌ ఖాన్‌ , రజత్‌ పాటిదార్ , జితేశ్‌ శర్మ , ముకేశ్‌ కుమార్‌, రవి బిష్ణోయ్‌లకు కొత్తగా కాంట్రాక్ట్‌ లభించింది.
 
 

Advertisement
Advertisement