ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. ధర్మశాల వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పంజాబ్ పరాజయం పాలైంది.
242 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. 17 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్, కరణ్ శర్మ, స్వప్నిల్ చెరో రెండు వికెట్లు సాధించారు.
పంజాబ్ బ్యాటర్లలో రిలీ రూసో(61) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(37) కాసేపు మెరుపులు మెరిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 7 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు.
కోహ్లితో పాటు రజిత్ పాటిదార్(55), కామెరాన్ గ్రీన్(46) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప రెండు, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంతో ఆర్సీబీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment