మాల్యా ‘కోరిక’ తీరేనా!
♦ ఆర్సీబీ ఆశలన్నీ ఆ ముగ్గురిపైనే
♦ స్పిన్నర్లకు అనుభవం తక్కువ
♦ ఆల్‌రౌండర్లతో అదనపు బలం
లాభాల కంటే ప్రచారం కోసమే ఐపీఎల్ జట్టును సొంతం చేసుకున్న విజయ్‌మాల్యా... గత ఏడేళ్లలో తన లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. స్టార్ ఆటగాళ్లు, పవర్ హిట్టర్లతో జట్టును నింపినా ఒక్కసారి కూడా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. కోహ్లి, గేల్, డివిలియర్స్ త్రయంపైనే మరోసారి ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఈసారైనా మాల్యా కోరిక తీరుతుందా..? ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరు ముద్దాడుతుందా?
మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను దిగ్గజ ఆటగాడిగా తీసుకుని 2008 ఐపీఎల్లో అరంగేట్రం చేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లో కుంబ్లే, స్టెయిన్, కలిస్‌లాంటి మేటి ఆటగాళ్లు బరిలోకి దిగారు. అయితే 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలిగింటిలో గెలిచి జాబితాలో ఆఖరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
తర్వాత జరిగిన వేలంలో 2009 సీజన్ కోసం అత్యధిక ధరకు పీటర్సన్‌ను కొనుగోలు చేయడంతో పాటు భారీ హిట్టర్ రైడర్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. ద్రవిడ్ స్థానంలో నాయకత్వ పగ్గాలు చేపట్టిన కేపీ లీగ్ మధ్యలో వెళ్లిపోగా, మిగతా మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కుంబ్లే జట్టు తలరాతను మార్చాడు. 8 విజయాలతో ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు. అయితే తుదిపోరులో డెక్కన్ చార్జర్స్ చేతిలో ఓడింది.
2010 సీజన్లో... ఉతప్ప, కలిస్‌ల సూపర్ ఫామ్‌తో వరుస విజయాలతో హోరెత్తించింది. అయితే కీలకమైన సెమీస్‌లో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 2011లో కోహ్లిని ఒక్కడినే రిటేన్ చేసుకుని మిగతా వాళ్లందర్ని వదులుకుంది. ఆ తర్వాత జరిగిన వేలంలో దిల్షాన్, జహీర్, డివిలియర్స్, వెటోరి, తివారీ, డెరిక్ నేన్స్ను తీసుకుంది. టోర్నీ మధ్యలో నేన్స్ గాయపడటంతో అతని స్థానంలో గేల్‌ను ఆడించింది. వెటోరి నాయకత్వం చేయగా, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడింది. తర్వాత గేల్ సునామీ బ్యాటింగ్‌తో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది.
పాయింట్ల పట్టికలో టాప్‌కి చేరి తొలి క్వాలిఫయర్‌లో చెన్నై చేతిలో ఓడింది. కానీ రెండో క్వాలిఫయర్‌లో ముంబైని ఓడించి టైటిల్ పోరులో ధోనిసేనను ఢీకొట్టింది. కానీ ఈసారి కూడా రన్నరప్‌గానే మిగిలింది. 2012లో గేల్‌కు గాయం, కెప్టెన్ కోహ్లి ఫామ్‌లో లేకపోవడంతో 16 మ్యాచ్లకుగానూ 8 మాత్రమే నెగ్గి గ్రూప్ దశకే పరిమితమైంది. 2013లో కొత్త ముఖాలతో ఆడినా... లీగ్ దశను దాటలేదు. గత సీజన్ కోసం వేలంలో యువరాజ్‌కు ఆర్సీబీ రూ. 14 కోట్లు వెచ్చించింది. డివిలియర్స్, గేల్, కోహ్లి... ఇలా కావలసినంత మంది స్టార్స్ ఉన్నా... ఒక్కరు కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చూపకపోవడంతో 14 మ్యాచ్లకుగానూ ఐదింటిలో మాత్రమే నెగ్గింది. భారీ ఆశలు పెట్టుకున్న యువీ... ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే చెలరేగాడు. డివిలియర్స్ రెండు నాణ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడినా వరుస ఓటములతో జట్టు గ్రూప్‌కే పరిమితమైంది.
ముగ్గురిపైనే ఆశలు
గతంలో రెండుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఆర్సీబీ ఈసారి ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ కోసం యువరాజ్, మురళీధరన్, జకాటీ, తన్మయ్ మిశ్రా, సచిన్ రాణాలను తప్పించి బద్రినాథ్, సీన్ అబాట్, మిల్నే, ఇక్బాల్ అబ్దుల్లా, సర్ఫరాజ్ ఖాన్, మన్దీప్ సింగ్, స్యామీ, జలజ్ సక్సేనా, బిస్లా, బావ్నేలను జట్టులోకి తెచ్చారు. కోహ్లి, డివిలియర్స్, గేల్లపైనే ఈ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురిలో ఒకరు ఫామ్‌లో ఉన్నా జట్టు విజయాలకు ఢోకా ఉండదు. కానీ గేల్ బ్యాటింగ్ అనిశ్చితి ఆందోళనకు గురి చేస్తోంది. డివిలియర్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
కీలక ఆటగాళ్లు: కోహ్లి, డివిలియర్స్, గేల్‌లతో పాటు ఆసీస్‌కు వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన స్టార్క్, మిల్నే, సీన్ అబాట్‌లు అత్యంత కీలకంకానున్నారు. స్పిన్నర్లకు అనుభవం లేకపోవడం కాస్త లోటుగా కనిపిస్తోంది. - సాక్షి క్రీడావిభాగం