ఈసారి మేం స్వేచ్ఛగా ఆడతాం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లి
ముంబై : క్రిస్ గేల్, డివిలియర్స్‌తో పాటు తాను కూడా ఈసారి ఐపీఎల్‌లో స్వేచ్ఛగా ఆడతామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. ఈసారి తమ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇటీవలి వేలంలో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, స్యామీ, బద్రీనాథ్ జట్టులోకి వచ్చారు. ‘ఈసారి సీజన్ మాకు చాలా విభిన్నమైంది. ఎందుకంటే గత నాలుగేళ్ల నుంచి నాతోపాటు గేల్, డివిలియర్స్‌లపైనే బ్యాటింగ్ భారం ఉండడంతో ఒత్తిడిలో ఆడాల్సి వచ్చేది.
ఇతర జట్లను గమనిస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో వారికి వెసులుబాటు ఉంది. అందుకే ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈసారి మేం కూడా అలాంటి ఆటతీరునే చూపుతాం. ఎందుకంటే దినేశ్ కార్తీక్, స్యామీ, బద్రీనాథ్, మన్‌దీప్ సింగ్ మా బ్యాటింగ్ లైనప్‌లో ఉన్నారు. వీరి అండతో మేం ముగ్గురం ఇక మా సహజశైలిలో ఆడతాం. ఇప్పటికే డివిలియర్స్ ప్రపంచకప్‌లో టి20 మజా చూపించాడు. రెండుసార్లు సెమీస్, ఓ సారి ఫైనల్‌కు వచ్చాం.
ఇక ఈసారి మాత్రం టైటిల్ లోటును తీర్చుకోవాలనే కసితో ఉన్నాం’ అని టీమ్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా కోహ్లి అన్నాడు. పేసర్ మిషెల్ స్టార్క్ మోకాలి గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల అనంతరం జట్టులో చేరతాడని చెప్పాడు. సుదీర్ఘ పర్యటన అనంతరం వెంటనే ఐపీఎల్ ఆడాల్సి రావడంలో ఇబ్బందేమీ లేదని కోహ్లి చెప్పాడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఇలాంటి సమస్యను సమర్థవంతంగా అధిగమించాల్సి ఉంటుందని, ప్రపంచకప్ తర్వాత లభించిన 9 రోజుల విరామంలో మేం బాగానే కోలుకున్నామని అన్నాడు.