తేజస్వీ యాదవ్ ధ్వజం
పటా్న: ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు. తాజాగా జనగణన చేపట్టకుండానే దేశంలో హిందూ, ముస్లింల జనాభాపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తుందని నిలదీశారు. దేశంలో ముస్లింల జనాభా పెరిగిందని, హిందువుల జనాభా తగ్గిందంటూ విడుదలచేసిన ఈఏసీ–పీఎం రిపోర్ట్‌పై తేజస్వీ స్పందించారు. ‘‘ అసలైన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే హిందూ, ముస్లింల మధ్య మోదీ సర్కార్ చిచ్చుపెడుతోంది. జనాభా లెక్కలు లేకుండానే ఎలా ఈ కొత్త లెక్కలతో వచ్చారు?
2021లో కూడా జనగణన ఎందుకు సాధ్యంకాలేదు. అప్పుడు, ఇప్పుడు మీరే ప్రధాని. హిందూ, ముస్లింలను వేర్వేరుగా పక్షపాత ధోరణితో చూసే విధానాన్ని విడనాడండి. సమస్యల గురించే మాట్లాడండి’ అని ప్రధానికి తేజస్వీ హితవు పలికారు. షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ఏ క్రాస్ కంట్రీ అనాలసిస్(1950–2015) పేరిట ఈఏసీ–పీఎం ఒక నివేదిను తయారుచేసింది. 1950వ సంవత్సరంను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తే దేశ జనాభాలో 84.68 శాతంగా ఉన్న హిందువులు 2015 ఏడాదివచ్చేసరికి 78.06 శాతానికి తగ్గారు. అంటే దేశజనాభాలో హిందువుల వాటా 7.82 శాతం తగ్గింది. అదే సమయంలో దేశజనాభాలో ముస్లింలు 9.84 శాతంగా ఉంటే 2015 ఏడాదినాటికి దేశజనాభాలో వారు 14.09 శాతానికి పెరిగారని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment