న్యూయార్క్: గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికా షాక్ ఇచ్చింది. రఫాలో దాడులకు దిగితే.. ఇజ్రాయెల్‌కు అయుధాలు సరాఫరా చేయబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం వార్నింగ్ ఇచ్చారు.
‘‘ఇజ్రాయెల్ గాజాలోని రఫా నగరంలోకి అడుగు పెడితే.. ఆయుధాలు సరాఫరా నిలిపివేస్తాం. మధ్య ప్రాచ్యం నుంచి జరిగే దాడులను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరాఫరా చేస్తాం. కానీ, రఫా నగరంపై దాడిచేస్తే.. ఆయుధాలు సరాఫరా నిలిపివేస్తాం’’ అని బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు పంపిన 2వేల పౌండ్ల బాంబుల సరాఫరాపై బైడెన్ స్పందిస్తూ.. అమెరికా సరాఫరా చేసే బాంబుల కారణంగానే గాజాలో పాలస్తీనా ప్రజలు మృతి చెందుతున్నారని తెలిపారు.
రఫా నగరంలో ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవటం కోసం అగ్రరాజ్యం అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పది లక్షల జనాభా ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇంకా రఫా నగరంపై పూర్తిస్థాయిలో దాడులకు దిగలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరాఫరా చేయటంపై మరోసారి సమీక్ష జరుపుతామని అమెరికాకు చెందిన ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.
‘తమ ఆయుధాలతో ఇజ్రాయెల్ గాజాలో పౌరులపై దాడులతో ప్రాణాలు తీస్తోందని అమెరికా ఏడు నెలల తర్వాత గుర్తించింది. ఇప్పటివరకు 34, 789 మంది పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు’ అని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment