WC 2023: శ్రీలంక క్రీడా మంత్రి సంచలన నిర్ణయం.. క్రికెట్‌ బోర్డు రద్దు | Sri Lanka Sports Minister Suspends Cricket Board Over World Cup Humiliation - Sakshi
Sakshi News home page

WC 2023: శ్రీలంక క్రీడా మంత్రి సంచలన నిర్ణయం.. క్రికెట్‌ బోర్డు రద్దు! ఇకపై..

Published Mon, Nov 6 2023 12:36 PM

WC 2023: Minister Suspends Sri Lanka Cricket Board Over World Cup Humiliation - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 టోర్నీలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంకకు గట్టి షాక్‌ తగిలింది. ఆటగాళ్ల అత్యంత చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

శ్రీలంక క్రికెట్‌ బోర్డు సభ్యులందరిపై వేటు వేసింది. ఈ క్రమంలో బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగను నియమించింది. ఈ మేరకు శ్రీలంక క్రీడా మంత్రి రోషన్‌ రణసింఘే తన నిర్ణయాన్ని ప్రకటించారు.

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ కమిటీని రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసిన ఆయన.. కఠిన చర్యలకు ఉపక్రమించారు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ నుంచి ఇప్పటిదాకా బోర్డు అధికారులకు సంబంధించిన ఆడిట్ రిపోర్టుపై విచారణ చేపడతామని రోషన్‌ రణసింఘే ఈ సందర్భంగా పేర్కొన్నారు.   

కాగా శ్రీలంక క్రీడా మంతిత్వ శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటిలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ముగ్గురు రిటైర్డ్‌ జడ్జీలు. ఇక వరల్డ్‌కప్‌-2023 టోర్నీలో భాగంగా వాంఖడేలో టీమిండియా చేతిలో శ్రీలంక చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.

భారత బౌలర్ల ధాటికి తాళలేక లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ బెంబేలెత్తిపోయింది. కేవలం 55 పరుగులకే ఆలౌట్‌ అయి చెత్త రికార్డులు మూటగట్టుకుంది. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. 

ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్‌ బోర్డు కార్యదర్శి మోహన​ డి సిల్వ తన పదవి నుంచి తప్పుకొన్నారు. మిగిలిన సభ్యులందరిపై వేటు వేస్తూ క్రీడా మంత్రి రోషన్‌ రణసింఘే సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ క్రికెట్‌ బోర్డు సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో రోషన్‌ ఇలా తానే స్వయంగా రంగంలోకి దిగారు.

కాగా 1996 వరల్డ్‌కప్‌ విజేత అయిన శ్రీలంక భారత్‌ వేదికగా తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట గెలిచింది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు కోల్పోయి చతికిలపడింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడి.. ఒకవేళ పాయింట్ల పట్టికలో టాప్‌-7కు చేరకపోతే చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశం కూడా కోల్పోతుంది.

Advertisement
Advertisement