20న లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి రాక | Sakshi
Sakshi News home page

20న లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి రాక

Published Wed, Apr 17 2024 12:40 AM

వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ అరుణ్‌బాబు, 
అధికారులు  - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకాయుక్త జస్టిస్‌ పి. లక్ష్మణ్‌రెడ్డి ఈనెల 20వ తేదీన జిల్లాకు విచ్చేయనున్నట్లు డీఆర్‌ఓ కొండయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20వ తేదీ ఉదయం 10 గంటలకు ధర్మవరానికి విచ్చేయనున్న జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి అక్కడి పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌లో బస చేస్తారన్నారు. అనంతరం రెండు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు కర్నూలుకు వెళ్తారన్నారు.

24, 25 తేదీల్లో

పోస్టల్‌ బ్యాలెట్‌

పుట్టపర్తి అర్బన్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌, ఇతర పోలింగ్‌ అధికారులు ఈనెల 24, 25 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫారం–12డీ దరఖాస్తులను పూర్తి చేసి ఆయా తేదీల్లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందజేయాలని సూచించారు. ఒక్క ఓటరూ స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

తాగునీటి ఎద్దడి

తలెత్తకుండా చర్యలు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి

వివరించిన కలెక్టర్‌

పుట్టపర్తి అర్బన్‌: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ అరుణ్‌బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డికి వివరించారు. మంగళవారం తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సీఎస్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను నీటితో నింపుతున్నామని తెలిపారు. అలాగే తాగునీటి ఎద్దడి తలెత్తిన 153 గ్రామాలకు 415 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కూలీలు పని చేసే ప్రదేశంలో నీడకోసం టెంట్లు, తాగునీరు అందుబాటులో ఉంచామని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సైతం అందిస్తున్నామన్నారు. వీసీలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మల్లికార్జున, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంటెక్‌ ఫలితాల విడుదల

అనంతపురం: జేఎన్‌టీయూఏ పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంటెక్‌ ఆర్‌–21 ఒకటి, మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే ఆర్‌–17 ఒకటి, మూడో సెమిస్టర్‌ సప్లిమెంటరీ, ఆర్‌–21, ఆర్‌–17 రెండో సెమిస్టర్‌ సప్లిమెంటరీ, డిసెంబర్‌, జనవరి నెలలో నిర్వహించిన ప్రీ పీహెచ్‌డీ (వింటర్‌ సెషన్‌) పరీక్ష ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ ఈ.కేశవరెడ్డి, కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బి.చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. ఫలితాలను జేఎన్‌టీయూఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

చల్లని కబురు

20, 21 తేదీల్లో వర్ష సూచన

బుక్కరాయసముద్రం: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాస్త్రవేత్తలు చల్లని కబురు చెప్పారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సహదేవరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40.6 –

42.5 డిగ్రీల మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 27.1–27.6 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 48–56 శాతం, మధ్యాహ్నం 23–28 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement