ప్రసంగం పూర్తి పాఠం చదవని గవర్నర్‌ | Sakshi
Sakshi News home page

ప్రసంగం పూర్తి పాఠం చదవని గవర్నర్‌

Published Tue, Feb 13 2024 1:40 AM

- - Sakshi

రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సోమవారం మరోమారు ప్రభుత్వం – గవర్నర్‌ మధ్య వివాదం భగ్గుమంది. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదివేందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి నిరాకరించారు. తొలుత తమిళంలో మాట్లాడుతూ అందరికీ ఆహ్వానం పలికిన ఆయన తర్వాత తనకు కేటాయించిన కూర్చీలో మౌనంగా కూర్చుండిపోయారు. దీంతో గవర్నర్‌ తరపున ఈ ప్రసంగం తమిళ తర్జుమా పాఠాన్ని స్పీకర్‌ అప్పావు సభకు వినిపించారు. ఇది ముగియగానే సభ నుంచి ఆర్‌ఎన్‌ రవి హఠాత్తుగా లేచి బయటకు వెళ్లి పోయారు. కాగా జాతీయ గీతం ఆలపించేందుకు ముందుగానే గవర్నర్‌ సభ నుంచి వెళ్లి పోవడం వివాదానికి దారి తీసింది.

సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి – గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి మధ్య వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని పక్కన పెట్టి, అందులో కొత్త అంశాలను గవర్నర్‌ చేర్చడం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితి ఈ ఏడాది పునరావృతం కాకుండా ముందుగానే గవర్నర్‌కు ప్రసంగంలోని అంశాలను ప్రభుత్వం పంపించింది. దీంతో కొత్త ఏడాదిలో తొలి సమావేశం వివాదాలకు ఆస్కారం లేకుండా గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమవుతుందని అందరూ భావించారు. అయితే సోమవారం అసెంబ్లీలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. మరోమారు గవర్నర్‌ సభ నుంచి వాకౌట్‌ చేసినట్లుగా అర్ధాంతరంగా వెళ్లి పోవడం వివాదానికి దారి తీసింది.

తొలి సమావేశం..
సెయింట్‌ జార్జ్‌ కోటలోని అసెంబ్లీ భవనంలో ఉదయం కొత్త ఏడాదిలో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని స్పీకర్‌ అప్పావు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్‌ ఆహ్వానించారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా సిబ్బంది వద్ద గౌరవ వందనం స్వీకరించి, జాతీయ గీతం ముగియగానే సభలోకి గవర్నర్‌ అడుగు పెట్టారు. ఆయనకు సభలో సీఎం స్టాలిన్‌ మొదలు అందరు సభ్యులు లేచి నిలబడి ఆహ్వానం పలికారు. తమిళనాడు సభ నిబంధనలకు అనుగుణంగా తొలుత తమిళ తల్లి గీతం ఆలపించారు.

ముందుగా జాతీయ గీతం ఆలపించాలన్న ప్రస్తావనను గవర్నర్‌ ఈ సమయంలో తీసుకొచ్చినట్లు సమాచారం. సభ నిబంధనలకు అనుగుణంగా తొలుత తమిళ తల్లి గీతం, చివర్లో జాతీయ గీతం ఆలపించడం జరుగుతుందని ఆయనకు స్పీకర్‌ అప్పావు వివరణ ఇచ్చినట్లు తెలిసిందే. తమిళ తల్లి గీతం తదుపరి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తమిళంలో మాట్లాడుతూ అందరినీ ఆహ్వానించారు. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని పక్కన పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేసినానంతరం తనకు కేటాయించిన సీట్లో మౌనంగా కూర్చున్నారు. దీంతో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగ పాఠం తమిళ తర్జుమాను స్పీకర్‌ అప్పావు సభకు వినిపించారు.

హఠాత్తుగా లేచి వెళ్లి పోయిన గవర్నర్‌
గవర్నర్‌ ప్రసంగాన్ని స్పీకర్‌ అప్పావు వివరిస్తూ రెండున్నర సంవత్సరాల డీఎంకే ప్రభుత్వ ప్రగతి, రికార్డులను, ప్రజాకర్షణ కార్యక్రమాలు, ప్రజా రంజక పాలన, ద్రవిడ మోడల్‌ గురింతి ప్రస్తావించారు. పుదుమై పెన్‌, కలైంజ్ఞర్‌ మగళిర్‌ తిట్టం, బడుల్లో అల్పాహార పథకం గురించి వివరిస్తూ దేశానికే ఇవి ఆదర్శంగా మారినట్లు పేర్కొన్నారు. నేరాల కట్టడిలో రాజీ లేదని, తమిళనాడు శాంతివనంగా ఉందని పేర్కొంటూ, పౌర చట్టాన్ని తమిళనాడులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణనకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞిప్తి చేశారు. కచ్చదీవులలో తమిళ జాలర్లకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, కావేరి తీరంలో మేఘదాతులో కర్ణాటక డ్యాం నిర్మాణ ప్రయత్నాలకు అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.

గ్లోబెల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌, తాగునీటి పథకాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, ఎగుమతులు, వైద్య రంగంలోనే కాదు క్రీడా రంగంలోనూ తమిళ ఖ్యాతిని చాటే విధంగా వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 2 వేలు చేసినట్లు, స్వయం సహాక బృందాలకు రుణాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల తమిళనాడుకు రూ. 20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. మెట్రో ఫేజ్‌– 2 పనులకు నిధులు, అనుమతులు కరువయ్యాయని పేర్కొంటూ, గత ఏడాది చివర్లో తమిళనాట వరద విలయం గురించి ప్రస్తావించారు. తమిళనాడును ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాలేదని, కనీస నిధులు కూడా కేటాయించాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కేర్‌ నిధిలో వృథాగా ఉన్న నగదులో రూ.50 వేల కోట్లను తమిళనాడుకు ఇప్పించేందుకు గవర్నర్‌ ప్రత్యేక చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రసంగం ముగింపు సమయంలో గాడ్సే అంటూ అప్పావు ఏదో వ్యాఖ్యలు చేయగానే గవర్నర్‌ హఠాత్తుగా తన సీట్లో నుంచి లేచి వాకౌట్‌ చేస్తున్న తరహాలో బయటకు వెళ్లి పోయారు. జాతీయ గీతాన్ని ఆలపించే ముందే గవర్నర్‌ హఠాత్తుగా సభ నుంచి బయటకు వెళ్లడం వివాదానికి దారి తీసింది. అదే సమయంలో సీనియర్‌ మంత్రి దురై మురుగన్‌ సభలో ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన గవర్నర్‌ ప్రసంగంలోని అంశాలను మాత్రమే సభా రికార్డులలో పొందు పరుస్తున్నట్లు, మిగిలినవన్నీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్‌ సభ నుంచి వెళ్లి పోవడం విచారకరమని న్యాయ శాఖమంత్రి రఘుపతి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచే విధంగా గవర్నర్‌ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే మిత్రపక్ష పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు గవర్నర్‌ చర్యలను తీవ్రంగా ఖండించారు.

నిబంధనలను విస్మరించిన గవర్నర్‌
ఈ సమావేశానంతరం స్పీకర్‌ అప్పావు నేతృత్వంలో సభా వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. ఇందులో సభలో చర్చించాల్సిన అంశాలను, సభ నిర్వహణ తేదీలు, చర్చల వివరాలు, బడ్జెట్‌ దాఖలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను స్పీకర్‌ అప్పావు మీడియాకు వివరించారు. 7 రోజుల పాటు సభ జరుగుతుందని ప్రకటించారు. 13వ తేదీ సంతాప తీర్మానాలు, 14, 15 తేదీలలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు, చర్చ, 16, 17, 18 తేదీలు సెలవు అని వివరించారు. ఈ నెల 19వ తేదీ ఆర్థిక బడ్జెట్‌, 20 వ్యవసాయ బడ్జెట్‌ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. 21వ తేదీన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన నివేదిక దాఖలు, 22న ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌పై చర్చతో సభ ముగియనున్నట్లు వివరించారు.

రోజూ సభ ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్‌ అసెంబ్లీలో వ్యవహరించారని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గవర్నర్‌ను ఆహ్వానించిన క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతం ఆలపించడం జరిగిందన్నారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ గీతం ముందుగా ఆలపించాలని గవర్నర్‌ తనను కోరినట్లు, నిబంధనలు మార్చలేమని తాను స్పష్టం చేశానని వివరించారు. ప్రసంగం చదవకుండా గవర్నర్‌ మౌనంగా కూర్చోవడం శోచనీయమని, అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన నడుచుకున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో జైలు శిక్షతో అనర్హత వేటుకు గురైన మంత్రి పొన్ముడి సీటును మార్చకుండా, అలాగే ఉంచడం గమనార్హం.

పస లేని ప్రసంగం
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్‌ ప్రసంగాన్ని స్పీకర్‌ అప్పావు చదవి వినిపించారని గుర్తు చేస్తూ.. ఇందులో ఏమాత్రం పస లేదన్నారు. రుచి, శుచి లేని అంశాలే ఇందులో ఉన్నట్టు, ఇది పాచి పోయిన(కుళ్లిన) ప్రసంగంగా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం – గవర్నర్‌ – స్పీకర్‌ మధ్య గొడవలకే అసెంబ్లీ వేదికగా మారిందని విమర్శించారు. తన ప్రసంగానికి ముందుగా జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్‌ కోరినట్టు, ఇందుకు స్పీకర్‌ నిరాకరించడంతోనే ఆయన ప్రభుత్వ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు వివరించారు. ప్రజలకు ఈ ప్రసంగం ద్వారా ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. కొత్త పథకాలకు చోటు లేకున్నా, సొంత డబ్బాను మాత్రం ఈ పాలకులు ఈ ప్రసంగం ద్వారా బాగానే వాయించుకున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, భవనాలకు ప్రస్తుతం రిబ్బన్‌ కట్టింగ్‌లు చేసుకుని తన ఘనత గా చెప్పుకుంటున్నారని విమర్శించారు.

సమర్థించిన బీజేపీ
గవర్నర్‌ అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారని, నిబంధనలకు అనుగుణంగానే సభలో కూర్చున్నట్లు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్‌ నాగేంద్రన్‌ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్‌ అప్పావు సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలతో సభ నుంచి హఠాత్తుగా గవర్నర్‌ బయటకు వెళ్లి పోయారని వివరించారు. స్పీకర్‌ ప్రసంగాన్ని పూర్తి చేసే వరకు గవర్నర్‌ సభలోనే ఉన్నారని పేర్కొంటూ, తమిళ తల్లి గీతం, జాతీయ గతం వ్యవహారంలో అసెంబ్లీ నిబంధనలను తాము గౌరవిస్తున్నామన్నారు. స్పీకర్‌ తీరుతోనే సభలో గవర్నర్‌ మౌనంగా కూర్చున్నారని, చివరకు ఆయన బయటకు వెళ్లేంత పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు.

Advertisement
Advertisement