తెలంగాణ కుంభమేళాకు వేళాయె | Sakshi
Sakshi News home page

తెలంగాణ కుంభమేళాకు వేళాయె

Published Thu, Feb 8 2024 4:14 AM

Gudimelige Festival Puja programs were organized grandly - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: మేడారం సమ్మక్క–సారలమ్మలకు పూజలతో తెలంగాణ కుంభమేళాకు అంకురార్పణ జరిగింది. ప్రతీ రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమికి ముందుగా వచ్చే బుధవారం రోజునే ఈ మహా ఉత్సవం మొదలవుతుంది. దానికి సరిగ్గా 14 రోజుల ముందు గుడిమెలిగె పండుగ జరుగుతుంది. బుధవారం మేడారంలోని సమ్మక్క, కన్నెపెల్లిలో సారలమ్మ గుడిలో పూజారులు తలస్నానాలు అచరించి తల్లుల అలయాలను శుద్ధి చేసి గుడిమెలిగె పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

మేడారంలో సమ్మక్క పూజారి సిద్దబోయిన మనీందర్‌ ఇంటి వద్ద పూజారులు కంకణాలు కట్టుకోగా, ఆడపడుచులు పసుపు, కుంకమలు, పూజారులు, వడ్డెలు పవిత్ర జలం, దూపం, యాటతో డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క గుడికి చేరారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క గుడి ఈశాన్యం మూలన ఎట్టి గడ్డి ఉంచగా, ఆడపడుచులు సమ్మక్క శక్తి పీఠాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించారు. అనంతరం సమ్మక్క గుడి గుమ్మం బయట ముగ్గులు వేసి అందంగా అలంకరించగా.

పూజారులు అమ్మవారికి దూప, దీపాలు వెలగించి పూజలు నిర్వహించి యాటను నైవేద్యంగా సమర్పించారు. కన్నెపెల్లిలోని సారలమ్మ గుడిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఇతర పూజారులతో కలిసి గుడిమెలిగె పండగ పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం ఆడపడుచులు సారలమ్మ గుడి ముందు ముగ్గులు వేసి అలంకరించారు.

బుధవారం సమ్మక్కకు బోనం పెట్టడం ఆనవాయితీ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నెల 14న ఉదయం 9 నుంచి రాత్రి 12 గంటల వరకు వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మండమెలిగె పండుగ జరుగుతుంది.  

జాతరకు మరో 13 రోజులే... పనుల పూర్తిలో ఇంకా జాప్యమే  
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు మరో 13 రోజులే ఉంది. ఆదివాసీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాజాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనుంది. ప్రతిసారీ కనీసం నాలుగు నెలల ముందు నుంచే జాతర నిర్వహణ ఏర్పాట్లు, అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. గతేడాది జూలైలో పంపిన ప్రతిపాదనలను మించి మొత్తం 21 శాఖలకు రెండు విడతల్లో రూ.105 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దాదాపుగా రెండు నెలలుగా సాగుతున్న పనులు చాలా వరకు పూర్తి కాలేదు.

మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌లు అధికారులతో విడతల వారీగా ఇప్పటికే నాలుగైదు సమీక్షలు నిర్వహించారు. రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, కల్యాణకట్టలు, చెక్‌డ్యాంలు, హోల్డింగ్‌ పాయింట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్, డంప్‌యార్డులు తదితర నిర్మాణాలు ప్రతిపాదనల్లో పేర్కొన్న ప్రకారం సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంది.

కొందరు భక్తులు జాతరకు ముందుగానే మొక్కులు చెల్లిస్తున్న క్రమంలో ఇప్పటికే మేడారం వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా ఉంటోంది. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన భక్తులు 365వ జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తారు.

గూడూరు, వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలాల్లో అసంపూర్తి పనులతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలాలేవు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ నుంచి ములుగు జిల్లా మల్లంపల్లి వరకు 189 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. మహబూబాబాద్‌ మండలం జమాండ్లపల్లి నుంచి వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట వరకు 32 కిలోమీటర్ల దూరం విస్తరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. 

అతిపెద్ద జాతరకు ఆ కమిటీనే వేయలే.. 
మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులో ఎప్పుడూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 2012 వరకు సజావుగానే సాగినా 2014 జాతర నుంచి ధర్మకర్తల మండలి ఏర్పాటులో ప్రతీసారి జాప్యమే అవుతోంది. 2014లో కోర్టు వివాదాల వల్ల ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో అధికారుల పర్యవేక్షణలోనే జాతర నిర్వహించారు.

2016లో పునరుద్ధరణ కమిటీని నియమించారు. 2018 మహాజాతరకు కాక లింగయ్యను చైర్మన్‌గా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశారు. 2020, 2022 జాతరలు పునరుద్ధరణ కమిటీతో నిర్వహించగా.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తారని ఆదివాసీలు భావిస్తున్నారు.

షెడ్యూల్‌ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం ప్రకారం ఆదివాసీలనే నియమించాలని కూడా కోరుతున్నారు. అయితే జాతరకు మరో 13 రోజులు ఉండగా ఇంకా ఆ కమిటీపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈసారి మహాజాతరను ధరకర్తల కమిటీ వేసి నిర్వహిస్తారా? లేక పునరుద్ధరణ కమిటీతో నడిపిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement