Video: Jagtial BRS Leader Suddenly Collapsed While Dancing, Later Died In Hospital - Sakshi
Sakshi News home page

వీడియో: డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన జగిత్యాల బీఆర్‌ఎస్‌ నేత.. ఆస్పత్రిలో కన్నుమూత

Published Sat, Apr 1 2023 12:45 PM

Jagtial BRS Leader Suddenly Collapsed Later Died In Hospital - Sakshi

సాక్షి, జగిత్యాల: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ పాల్గొనాల్సిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ రజని భర్త, బీఆర్‌ఎస్‌ నేత బండారి నరేందర్‌ హఠాన్మరణంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం సంబురాల్లో.. ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే.. 

అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే ఆయనకు సీపీఆర్‌ అందించారు. మంచి నీళ్లు తాగించి.. స్పృహలోకి తీసుకొచ్చారు. ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న వాహనంలో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కోలుకుని క్షేమంగా తిరిగొస్తారని భావించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు.. ఆ మరణం వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. 

ఇదిలా ఉంటే గుండెపోటుతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కవిత ఆధ్వర్యంలో జగిత్యాలలో ఇవాళ రోడ్‌షో, ఆపై బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేయగా.. అందులో నరేందర్‌ పాల్గొన్నారు. స్థానిక నేత మృతితో సమ్మేళనం బీఆర్‌ఎస్‌ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

కవిత కార్యక్రమాలు రద్దు
బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత బండారి నరేందర్ హఠాన్మరణంతో.. జగిత్యాలలో నేటి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం వేదిక వద్దే నరేందర్ చిత్రపటానికి, అలాగే ఆయన పార్థీవ దేహానికి కవిత నివాళులర్పించారు. ఆపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కవిత,  మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు.

Advertisement
 
Advertisement
 
Advertisement