వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్‌ఏ బృందం | Sakshi
Sakshi News home page

వచ్చేవారం మేడిగడ్డకు ఎన్డీఎస్‌ఏ బృందం

Published Fri, Mar 1 2024 4:31 AM

NDSA team to visit Medigadda on March 2nd Week: telangana - Sakshi

కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్‌ వెల్లడి 

పరిశీలన కోసం చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ రాక 

సమస్య పరిష్కారానికి కేంద్రం ప్రయత్నిస్తోంది 

బ్యారేజీపై కాంగ్రెస్‌ సర్కారు కూడా పూర్తి సమాచారం ఇవ్వలేదు 

ఆ డేటా ఇస్తేనే పూర్తిస్థాయి పరిశీలనకు వీలవుతుందని వివరణ

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీపై విచారణ కోసం నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కొత్త చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వచ్చేవారం రానుందని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు, కేంద్ర నదుల అనుసంధాన టాస్‌్కఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ వెదిరె శ్రీరామ్‌ తెలిపారు. మేడిగడ్డకు సంబంధించి ఎన్డీఎస్‌ఏ కోరి న పూర్తి సమాచారాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే గాకుండా.. ›ప్రస్తుత కాంగ్రెస్‌ సర్కారు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ డేటా ఇస్తేనే.. జియో సిస్మిక్, క్వాలిటీ చెక్‌ వంటి అంశాలపై అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని స్ప ష్టం చేశారు. గురువారం పీఐబీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. గోదావరి నదిపై వివిధ తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి, మేడి గడ్డ సమస్య, కేఆర్‌ఎంబీ అధికార పరిధి, కేఆర్‌ఎంబీ–2కు సంబంధించి కొత్త టర్మ్స్‌ ఆఫ్‌ రిఫెరెన్స్‌లపై శ్రీరామ్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

పూర్తి పరిశీలన తర్వాతే తేలేది.. 
ఎన్డీఎస్‌ఏ జియో సిస్మిక్, జియో ఫిజికల్, సాంకేతిక అంశాలు, ఇతర నాణ్యత ప్రమాణాల పరిశీలన జరిపాకే.. బ్యారేజీల విషయంలో స్పష్టత వస్తుందని వెదిరె శ్రీరామ్‌ వివరించారు. ఆయా అంశాల పరిశీలన కోసం కమిటీకి నాలుగు నెలల సమయం ఇచ్చామని, నెల రోజుల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని కోరామని తెలిపారు. మేడిగడ్డలో పియర్స్, కాంక్రీట్‌ బ్లాకులు కుంగిపోయినందున.. ఈ ప్రాజెక్టులో ఇతర చోట్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్డీఎస్‌ఏ పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే మేడిగడ్డను పునరుద్ధరించవచ్చా? దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటిలభ్యత, అంతర్రాష్ట్ర అంశాల ప్రాతిపదికనే ఆమోదం కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తెలిపిందని చెప్పారు. డిజైన్‌ లోపాలు తెలంగాణ నీటిపారుదలశాఖ, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో)లవేనని.. సీడబ్ల్యూసీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. 

సమస్య పరిష్కారానికే కేంద్రం ప్రయత్నం.. 
తెలంగాణ, ఏపీ మధ్య జల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం, కేఆర్‌ఎంబీ ప్రయత్నిస్తున్నాయని.. దీనివెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని శ్రీరామ్‌ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్‌)లో గణాంకాలు ఒక్కో దగ్గర ఒక్కోలా ఉన్నందున పరిశీలించే అవకాశం లేదని సీడబ్ల్యూసీ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాకుండా అదనపు (మూడో టీఎంసీ) పనులకు ఆమోదం లేదని కూడా స్పష్టం చేసిందని.. ఆ క్రమంలోనే ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఇతర వాణిజ్య సంస్థలు రాష్ట్రానికి రూ.28వేల కోట్ల రుణాలను నిలిపివేశాయని చెప్పారు. కేంద్రం కూడా ఈ పనులను 2021 జూలైలోనే అనుమతి లేని జాబితాలో చేర్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్‌లో.. ఎకరాకు వంద క్వింటాళ్ల పంట పండుతుందని పేర్కొందని చెప్పారు. దీనితోపాటు ప్రజలకు సరఫరా చేసే మంచినీటికి ఇంత అని, సాగునీటికి ఫీజులు, సెస్సుల వసూలు ద్వారా ఇంత అని ఆదాయం లెక్కలు చూపిందన్నారు. 

ప్లంజ్‌పూల్‌తో ప్రమాదం 
శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్‌ తొలిచినట్టు అయి.. దాని పగుళ్లు డ్యాం కిందివరకు వెళ్లడం ప్రమాదకరమేనని శ్రీరామ్‌ పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ డ్యామ్‌ల భద్రతకు సంబంధించి ఎన్డీఎస్‌ఏ ఇటీవలి నివేదికలు కూడా ఈ ప్రాజెక్టులకు తీవ్రమైన నిర్వహణ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే డ్యామ్‌ల స్థిరత్వానికి ప్రమాదమన్నారు.

Advertisement
Advertisement