●నేషనల్‌ హైవేలకు జగనన్న కృషి | Sakshi
Sakshi News home page

●నేషనల్‌ హైవేలకు జగనన్న కృషి

Published Thu, May 9 2024 6:15 AM

●నేషన

పులివెందుల: పులివెందుల అభివృద్ధికి చిరునామా .. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన నేల ఇది.. కుట్రలు, కుతంత్రాలను చేధించి నిలబడేది పులివెందుల అని, అటువంటి పులివెందుల గడ్డ మీద నుంచి 45 ఏళ్లుగా వైఎస్‌ కుటుంబాన్ని ఆదరిస్తున్న పులివెందుల ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పులివెందుల పాత ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌ నుంచి స్థానిక వెంకటేశ్వరస్వామి గుడి వరకు మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, డాక్టర్‌ ఈసీ దినేష్‌రెడ్డి, అభిషేక్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి, గండ్లూరి శివారెడ్డి తదితరులతో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద జరిగిన బహిరంగసభలో ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ జగనన్నకు పులివెందులపై ఎంత ప్రేమంటే గడిచిన ఐదేళ్లలో ఈ విషయాన్ని తాను దగ్గరుండి గమనించానన్నారు. ఈ ఐదేళ్లలో పులి వెందుల నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మహానేత వైఎస్సార్‌ మరణం తర్వాత వచ్చిన పాలకులు పులివెందులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పుడు తిరిగి మన నాయకుడు జగనన్న సీఎం అయ్యాక పులివెందులను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడన్నారు. పులివెందుల రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, మెడికల్‌ కళాశాల, పులివెందుల రాణితోపు, రింగ్‌రోడ్డు అభివృద్ది, గరండాలవంక, ఉలిమెల్ల లేకవుట్‌, పులివెందుల సర్కిళ్లు ఇలా ఎన్నో విధాలుగా పులివెందుల అభివృద్ధి చెందిందన్నారు. వైఎస్సార్‌ హయాంలో గోవిందరాజ స్పిన్నింగ్‌ మిల్‌, పులివెందుల పాలిమర్స్‌ తెస్తే....జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆదిత్య బిర్లా, అపాచీ వంటి పరిశ్రమలు తెచ్చారన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న మళ్లీ సీఎం కావాల్సిన అవసరముందన్నారు.

అబద్ధపు హామీలతో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు 2014లో ఇదే కూటమితో ఆరోజు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ఎన్నికలయ్యాక అధికారంలోకి వచ్చి హామీలన్నీ గాలికి వదిలి వేశారన్నారు. మళ్లీ నేడు అదే కూటమితో ప్రజలకు అబద్ధపు హామీలు ఇస్తున్నారన్నారు.

పోలింగ్‌ శాతం తగ్గించేందుకు టీడీపీ కుట్ర

పులివెందుల అసెంబ్లీ స్థానానికి 27 మంది నామినేషన్లు వేయడం జరిగిందన్నారు. అందులో 18 మంది టీడీపీకి చెందిన వారు స్వతంత్రులు, వివిధ పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు వేశారన్నారు. వీరంతా టౌన్‌లో అల్లర్లు సృష్టించి గొడవలు పడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పోలింగ్‌ శాతం తగ్గించాలని కుట్ర పన్నుతున్నారన్నారు. వీరి ఆలోచనలు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎంపీ ప్రజలను కోరారు.

సింహాద్రిపురం: పులివెందుల అంటేనే బ్రాండ్‌.. నమ్మకం.. భరోసా అని.. కుట్రలు, కుతంత్రాలు చేసేవారిని తరిమికొట్టే శక్తి ఇక్కడి జనాలకు ఉందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సింహాద్రిపురంలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జగనన్న ఐదేళ్ల పాలన సాగిందని.. సంక్షేమ ప్రదాత జగనన్నను మళ్లీ రెండోసారి సీఎంగా ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గండికోట నుంచి పైడిపాలెం, అక్కడి నుంచి చిత్రావతి డ్యాములకు నీరు నింపారన్నారు. 18 మాసాలుగా వర్షాలు పడకపోయినా ఇబ్బందులు కలగకపోవడానికి కారణం అప్పట్లో వైఎస్సార్‌ చేసిన అభివృద్ధి, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన పనులే కారణమని వివరించారు. 2019 గండికోటలో 7టీఎంసీల నీరు నింపడానికి వీలు లేకపోవడంతో రూ.900కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించి ఆ గ్రామాలను ఖాళీ చేయించి 2021లో 27టీఎంసీలు నీరు నింపడానికి వీలు కల్పించారన్నారు. అలాగే పైడిపాలెం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలకు రూ.32కోట్లు నష్టపరిహారం అందించారని గుర్తు చేశారు. మండలం చుట్టూ రింగురోడ్డు వేస్తారా అంటూ మీకు రింగు వేయడానికి ప్రయత్నం చేస్తున్న పచ్చబ్యాచ్‌ మాటలు నమ్మొద్దన్నారు.

లింగాల: లింగాల రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి ఎంపీ మాట్లాడుతూ కృష్ణాజలాలను సీబీఆర్‌కు తీసుకురావడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషి ఎనలేనిదన్నారు. 2020లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఆర్‌లో నాలుగు మునక గ్రామాలకు రూ.240 కోట్లు చెల్లించి క్లియర్‌ చేశారన్నారు. 2020 నుంచి సీబీఆర్‌లో 3సార్లు 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగిందన్నారు. 2023లో 10టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం వల్ల ఇంతటి అనావృష్టిలోనూ త్రాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉందన్నారు. ఇప్పటికీ సీబీఆర్‌లో 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. దీంతో నియోజకవర్గానికి నీటి సమస్య లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ప్రజలకు అందాల్సిన పథకాలను అడ్డుకుంటున్నారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు బటన్‌ నొక్కిన ఈబీసీ నేస్తం, చేనేత నేస్తం, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలను ప్రజలకు అందకుండా చేశారన్నారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారని, కోర్టు నుంచి తీర్పు సానుకూలంగా వస్తే 48గంటల్లో ఆయా పథకాలకు సంబందించిన లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. లేదంటే తిరిగి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వారం రోజుల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు.

పులివెందుల ప్రజల రుణం ఏం చేసినా తీర్చుకోలేనిది

పులివెందుల అంటే అభివృద్ధికి చిరునామా

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల ఊరు చుట్టూ నేషనల్‌ హైవే కోసం జగనన్న ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి గడ్కరి దృష్టికి తీసుకువచ్చారన్నారు.పులివెందుల–బెంగుళూరు, పులివెందుల–విజయవాడ హైవే పనులు కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు ప్యారలాల్‌గా పులివెందుల–బెంగుళూరు పనులు జరగుతున్నాయన్నారు. ఇవన్నీ పెద్ద ఎత్తున పులివెందుల ఊరుచుట్టూ జరుగుతున్నాయన్నారు. కడప–బెంగుళూరు రైల్వేలైన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని, 15 ఏళ్లుగా పనిచేసినా 245 కిలోమీటర్లకు సంబంధించి 27 కిలోమీటర్లు మాత్రమే పూర్తయిందన్నారు. దీనికి కారణం భూ సేకరణకు రైల్వేశాఖ ఇచ్చే డబ్బులు చాలా తక్కువని తెలిపారు. పెండ్లిమర్రి వరకు అయిపోయిన లైన్‌ను పెండ్లిమర్రి–పుట్టపర్తి వయా పులివెందులకు తీసుకు వెళ్లాలని కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. అదేవిధంగా పెండ్లిమర్రి–పుట్టపర్తి లైన్‌కు ముద్దనూరు నుంచి కూడా ఒక లైన్‌వేసి పులివెందులకు కలుపాలని విన్నవించారన్నారు. ముద్దనూరు ప్రాంతంలో సిమెంటు పరిశ్రమలు ఉండడం వల్ల ఇది రైల్వేశాఖకు ఎంతో ఆదాయం తెస్తుందన్నారు. ఇవన్నీ జరిగితే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కొప్పర్తిలోని కారిడార్‌ 6600 ఎకరాల్లో నిర్మిస్తున్నారని, అందులో లక్ష మంది పనిచేయాలని జగనన్న ఆశయమన్నారు. బ్రహ్మంసాగర్‌ నుంచి కొప్పర్తికి నీరు అందించే పనులు కూడా జరుగుతున్నాయన్నారు. జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ వల్ల 25 వేల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

●నేషనల్‌ హైవేలకు జగనన్న కృషి
1/1

●నేషనల్‌ హైవేలకు జగనన్న కృషి

Advertisement

తప్పక చదవండి

Advertisement