హోండా కార్స్ నుంచి అప్డేటెడ్ బ్రియో | Sakshi
Sakshi News home page

హోండా కార్స్ నుంచి అప్డేటెడ్ బ్రియో

Published Wed, Oct 5 2016 1:27 AM

కారును ఆవిష్కరిస్తున్న హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యొచిరొ యుఎనొ

ప్రారంభ ధర రూ.4.69 లక్షలు
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ బ్రియోలో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.69-రూ.6.81 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఇది ఈ ఎంటీ, ఎస్ ఎంటీ, వీఎక్స్ ఎంటీ, వీఎక్స్ ఏటీ అనే నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.

 ప్రత్యేకతలు..
కంపెనీ తాజా అప్‌డేటెడ్ బ్రియోలో పలు కొత్త ఫీచర్లను పొందుపరిచింది. ఇందులో ప్రధానంగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5 స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, స్పోర్టీ ఎక్స్‌టీరియర్స్, ప్రీమియం ఇంటీరియర్స్, సరికొత్త ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్, నూతన టెయిల్ ల్యాంప్, అడ్వాన్స్‌డ్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబీఎస్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, డిజిటల్ ఏసీ కంట్రోల్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు వరుసగా లీటరుకు 18.5 కిలోమీటర్లు, 16.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయని పేర్కొంది.

 నూతన బ్రియో ఒక ఆల్‌రౌండర్
హోండా ఇంజినీరింగ్ నైపుణ్యాలకు, తయారీ విలువలకు బ్రియో నిదర్శనంగా నిలిచిందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యొచిరొ యుఎనొ తెలిపారు. ‘బ్రియో ఒక ఆల్‌రౌండర్ లాంటిది. విశాలవంతంగా, సౌకర్యవంతంగా, చూడటానికి చక్కగా ఉంటుంది. అలాగే మైలేజ్, ఇంజిన్, పనితీరు.. ఇలా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కూడా బ్రియోతో కస్టమర్ సంతృప్తిపడతాడు’ అని పేర్కొన్నారు. కాగా కంపెనీ బ్రియోను 2011లో మార్కెట్‌లోకి తెచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement