ఎప్పటికప్పుడు మాట మార్చేస్తుంటారు.. | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు మాట మార్చేస్తుంటారు..

Published Tue, Jul 7 2015 12:17 AM

ఎప్పటికప్పుడు మాట మార్చేస్తుంటారు.. - Sakshi

ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్లపై అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:
నిత్యం పరస్పరం భిన్నమైన కామెంట్లతో హడావిడి చేసే ఆర్థికవేత్తలు, మార్కెట్ కామెంటేటర్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారు మాటలు మార్చేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు. సంక్షోభాన్ని గుర్తించడంలో ఎకానమిస్టుల వైఫల్యంపై ప్రముఖ ఆర్థికవేత్త లార్డ్ మేఘనాద్ దేశాయ్ రాసిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జైట్లీ వ్యాఖ్యలకు వేదికైంది.

పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత రాత్రి టీవీలో గ్రీస్ రిఫరెండం ఫలితాలు చూశాను. మన దేశంలో పేరొందిన ఒక కామెంటేటర్ .. సోమవారం మన మార్కెట్లపై ఆ ఫలితాల ప్రభావం గురించి చెప్పుకొచ్చారు. సోమవారం మార్కెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుందని, పెద్ద షాక్ షాక్ తప్పదని.. ఏవేవో విశేషణాలన్నీ జోడించి చెప్పారు. సోమవారం మధ్యాహ్నం దాకా అదే పాట కొనసాగించారు. కానీ, ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు క్రమంగా అర్థమయినట్లున్నాయి.

వెంటనే ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. విశ్లేషణ కూడా మారిపోయింది’ అని తెలిపారు. ఏడాది కాలంగా క్రూడ్ ధరల విషయంలోనూ ఇలాగే జరుగుతోందని జైట్లీ వ్యాఖ్యానించారు. రాబోయే సంక్షోభాలను, పరిణామాలను చాలా మంది ఎకానమిస్టులు ముందుగా ఎందుకు గుర్తించలేరన్నది తనకు అంతుబట్టని విషయమని జైట్లీ చెప్పారు. ఇక సరైన హెచ్చరికలు చేయకుండా అంతా జరిగిపోయాకా.. ‘మేం అప్పుడే చెప్పాం కదా’ అని చెప్పుకునే ఎకానమిస్టులు కొందరు ఉంటారని జైట్లీ చెప్పారు. ఏదైతేనేం.. ఇథమిత్థంగా ఇలాంటి వాటిని గురించి ముందస్తుగా అంచనా వేయగలిగే సామర్థ్యం ఏ కొద్ది మందికో పరిమితమన్నారు.

Advertisement
 
Advertisement