సాహితీ సమరాంగణ సార్వభౌముడు
కావ్యం అనే తెలుగుపిల్ల వాగనుశాసనుడి వద్ద వర్ణాలు దిద్ది, అచ్చతెలుగు నుడిలో ఆటవెలదులాడి, పోతనామాత్యుని భక్తిరసంలో మునిగితేలి, కవిసార్వభౌముని శృంగార వైభవాలు కళ్ళజూసి, పూర్తి ప్రౌఢత్వంతో రాయల భువనవిజయం అనే శిఖరాన్ని అలంకరించింది.
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల యుగం స్వర్ణయుగం. కన్నడ రాజ్యలక్ష్మి కొలువులో తెలుగుభాష రాజభాష అయింది.‘తెలుగ దేల యన్న, దేశంబు దెలు గేను దెలుగు వల్లభుండ, దెలుగొకండ యెల్లనృపులు గొలువ నెరుగనే బాసాడి దేశభాషలందు దెలుగు లెస్స’
అన్న రాయలు, తెలుగులో ‘ఆముక్తమాల్యద’ స్వయంగా రచించడమేగాక, అష్టదిగ్గజాలనే మహాకవులని పోషించాడు. విద్యానగరంలో మన తెలుగు కవులని అందలం ఎక్కించాడు. కనీవినీ ఎరుగని రీతిలో ప్రబంధ రచన జరిగింది. కావ్యరచన, పాత్రల చిత్రణలో, పద్దెనిమిది వర్ణనలలో, అలంకారాలతో కొత్తపుంతలు తొక్కింది. దృశ్యశ్రవణ ప్రదర్శనలకి అనువైన రీతిని స్వంతం చేసుకుంది.
విజయనగరంలో కవులు మహారాజ వైభవాలు అనుభవించారు. మనుచరిత్ర అంకితం తీసుకొన్న రోజున రాయలు, పెద్దన పల్లకి స్వయంగా మోసాడట. ఎదురొస్తే చేయందంచి ఏనుగు అంబారీలో పక్కన కూర్చోపెట్టుకునేవాడట. ప్రబంధయుగంలో ఇతివృత్తాలు, వర్ణనలు ఆనాటి విజయనగర వైభవానికి అద్దం పడతాయి. ముక్కు తిమ్మన పారిజాతాపహరణంలో ఇతివృత్తం మనకి శ్రీకృష్ణతులాభారం నాటకంగా, సినిమాగా పరిచయమే. అందులో సత్యభామ మందిరంలో కృష్ణుని దినచర్య, ఆనాటి రాయల దైనందిన క్రమాన్ని ప్రతిబింబిస్తుందని చారిత్రకుల అభిప్రాయం.
ప్రబంధరచనలో శృంగారం పాలు కొంచెం ఎక్కువే! రమణీ ప్రియదూతికలు ఇచ్చిన తాంబూలం, ఆత్మకింపయిన భోజనం చేసి, ఉయ్యాల మంచంపై కూర్చుంటే గానీ అటువంటి కవిత్వం రాదని పెద్దనగారే స్వయంగా చెప్పారు. ఇక సుకుమార వార వనితల అధరామృతం ఎల్లప్పుడూ సేవించబట్టే ధూర్జటికి కవితా మాధుర్యం అబ్బిందట!
ఆనాడు దేశం సుభిక్షంగా, సుసంపన్నంగా ఉందని ఎందరో విదేశీ యాత్రికులు సాక్ష్యమిచ్చారు. రాజ్యంలో కొత్త చెరువులు తవ్వడానికి అనువైన ప్రదేశాలలో అన్నిచోట్లా అప్పటికే నిర్మాణాలు జరిగిపోయాయట! ప్రభుత్వాదాయంలో అన్ని ఖర్చులూ - అంటే సైన్యం, అభివృద్ధి పనులూ, స్వంత వ్యయాలూ - పోగా సాలుకి కోటి వరహాలు మిగిలేవట! ఇక సంస్థానాధీశులకి 15 వేల నుండి 11 లక్షల వరకూ జీతాలు. అలాంటి సంస్థానాధిపతులు కూడా ఎందరో కవిపండితులని పోషించారు.
పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పేయ్స్ వివరించినట్లు, ఆనాటి వ్యవస్థలో సామాన్య భటుడి రోజుకూలి ఒక మాడ. ఒక మాడ (మాడ= రూపాయి) విలువ ఎలాంటిదో చూద్దాం: 2 పైసలకి కోడి, 15 పైసలకి మేక, రెండున్నర పైసలకి కిలో బియ్యం. అంటే రోజుకూలితో ఇరవై కిలోల బియ్యం కొన్నా, మూడు మేకలు లేదా ఇరవై కోళ్లు కొన్నా ఇంకా చిల్లర మిగిలేది.
కాని అదే కాలంలో కోస్తాంధ్ర, తెలంగాణల్లో కవులకి ఆదరణ కరువైంది. రెడ్డిరాజుల పతనంతో కోస్తాంధ్ర ఓడ్ర గజపతుల ఆధీనమైంది. శ్రీనాథ కవిసార్వభౌముడినే కౌలు కట్టలేదని భుజాన బండ మోపి ఎండలో నడివీధిలో నిలబెట్టారు. తెలంగాణలో పరిస్థితి ఇంకా అధ్వాన్నం. కుతుబ్‌షాహి, ఆదిల్ షా, బరీద్ షా సుల్తాన్‌ల మధ్య పోరుతో గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. చిన్న చిన్న దొరల సంస్థానాలలో దొరికిన పోషణ, విజయనగర వైభవం ముందు దిగదుడుపే. ఇచ్చిన వాడిని పొగడటం, ఇవ్వని వాడిని తిట్టడం కవులకి ఆనవాయితీ అయింది.
అలాంటి పరిస్థితుల్లో...
కొండవీడు మనదేరా! కొండపల్లి మనదేరా!
కాదని వాదుకు వస్తే కటకం దాకా మనదేరా!
అంటూ క్రీ.శ.1515లో కృష్ణరాయలు నెల్లూరు నుండి పొట్నూరు దాకా విజయయాత్ర సాగించి, కోస్తాంధ్రని విజయనగర రాజ్యంలో కలుపుకున్నాడు. ఆంధ్రకవులకి భువనవిజయపు వాకిళ్లు తెరుచుకున్నాయి. మాదయ్యగారి మల్లన, పింగళి సూరన, తెనాలి రామలింగడు వంటి అనేక కవులు విజయనగరం దారిపట్టారు. ప్రబంధాలు రచించారు. రాయల కొలువులో సాగిన ప్రబంధ సంప్రదాయాన్ని, తరువాతి యుగాల్లో పెనుగొండలో ఆరవీటివారూ, మధుర, తంజావూర్లలో నాయక రాజులు కొనసాగించారు.