న్యూఢిల్లీ: దేశంలో ‘బ్లూ వేల్ ఛాలెంజ్’ వీడియో గేమ్ సష్టిస్తున్న అలజడి ఇంతా అంతా కాదు. గత నెలరోజుల్లో ఎంతో మంది టీనేజర్లు ఈ వీడియో గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలు వెలువడడం ఎంతో మంది పిల్లల తల్లిదండ్రులను భయకంపితుల్ని చేసిందీ, చేస్తోంది. ఈ విషయమై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ కేంద్ర హోం శాఖ, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రుల దష్టికి స్వయంగా తీసుకెళ్లగా ‘బ్లూ వేల్ ఛాలెంజ్’ గేమ్‌కు సంబంధించిన అన్ని లింక్‌లను తీసివేయాల్సిందిగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలకు, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూ లాంటి సర్చ్, వెబ్ సంస్థలకు ఉత్తర్వులు అందాయి.
రష్యా నుంచి పుట్టుకొచ్చిందని భావిస్తున్న ఈ గేమ్‌కు నిజంగా టీనేజ్ పిల్లలు ఆకర్షితులై అన్యాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా? ఇప్పటి వరకు ఈ గేమ్ కారణంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు భావిస్తున్న పిల్లలు నిజంగా ఈ గేమ్‌ను ఆడారా? వారి మరణానికి మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా? అసలు ఇప్పటి వరకు పోలీసులు తమ దర్యాప్తులో తేల్చిందేమిటీ? ఒక్కో ఆత్మహత్యకు సంబంధించిన కేసును లోతుగా పరిశీలించినప్పుడే అందులోని నిజా నిజాలు వెలుగు చూస్తాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఆగస్టు 12వ తేదీన అంకన్ దేవ్ అనే 15 ఏళ్ల బాలుడు ముఖానికి ప్లాస్టిక్ కవరు, మెడకు టవల్‌ను చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతను ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బ్లూవేల్ చాలెంజ్ గేమ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం జరిగిందీ. పత్రికల్లో ఆ మేరకు వార్తలు కూడా వచ్చాయి.
అతని దగ్గరి మిత్రుల వద్దకు పోలీసులు వెళ్లి వాకబు చేయగా, చనిపోవడానికి రెండు, మూడు రోజుల ముందు అంకన్ దేవ్ తాను రాసినట్లుగా ఓ చిన్న ఇంగ్లీషు పోయమ్ వారికి చూపించారట. తీవ్ర మానసిక క్షోభను వ్యక్తం చేస్తున్న ఆ పోయం వాస్తవానికి తాను రాసింది కాదనీ, నెట్‌లో కనిపిస్తే కాపీ చేశానని, ఎవరు రాశారో కూడా తెలియదని ఆ తర్వాత చెప్పారట.
‘అంకన్ దేవ్ వీడియో గేమ్‌లు ఆడేందుకు ఆయన వద్ద స్మార్ట్‌ఫోన్ కూడా లేదు. అప్పుడప్పుడు తండ్రి షాప్‌లో ఉన్న కంప్యూటర్‌పై ఇంటర్నెట్ సెర్చ్ చేస్తుంటాడు. ఆ బాలుడు సర్చ్ చేసిన అన్ని సైట్లను క్షుణ్నంగా పరిశీలించాం. బ్లూవేల్ గేమ్ పరిచయం ఉన్న సూచనలు కూడా లేవు. ఈ గేమ్‌కు ఆ బాలుడి ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదు. ఇంగ్లీషు పోయం కారణంగా ఆ బాలుడు మానసిక ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది’ అని పశ్చిమ మిడ్నాపూర్ ఎస్పీ భారతి ఘోష్ తెలిపారు.
మరి గేమ్‌తో లింక్ ఎలా వచ్చింది?
అంకన్ దేవ్ ఆత్మహత్యపై కారణాలు కనుక్కొనేందుకు ఆయన మిత్రుల వద్దకు ఓ స్థానిక విలేకరి వెళ్లారు. దేవ్ అప్పుడప్పుడు వీడియో గేమ్ ఆడతాడని చెప్పేవాడని, ఏం వీడియో గేమ్‌లు ఆడుతాడో తమకు తెలియదని మిత్రులు తెలిపారు. అప్పటికే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కారణంగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు వ్యాప్తిలో ఉండడంతో తాను కూడా బాలుడి ఆత్మహత్యను గేమ్‌కు ముడిపెట్టి రాసినట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సదరు విలేకరి తెలిపారు.
ముంబై, ఢిల్లీ నగరంలో కూడా పిల్లల ఆత్మహత్యలకు ఈ గేమ్ కారణమంటూ వార్తొలొచ్చాయి. అయితే వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. తూర్పు అంధేరిలో జూలై 29వ తేదీన 14 ఏళ్ల బాలుడు ఏడంతస్థుల మేడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘మరుక్షణం నా ఫొటో మినహా మరేమి మిగలదు’ అన్న వ్యాఖ్యానంతో ఆ బాలుడు సెల్ఫీదిగి మేడమీది నుంచి దూకేశాడు. బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కారణంగా ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ జూలై 31వ తేదీన పత్రికల్లో వార్తలొచ్చాయి. భారత్‌లో ఇదే తొలి బ్లూ వేల్ ఛాలెంజ్ చావని కూడా ప్రచారమైంది.
గేమ్ కారణంగానే బాలుడు ఆత్మహత్య చేసుకున్నారని విశ్వసనీయ పోలీసు వర్గాలు తెలిపాయంటూ, ఇద్దరు టీచర్లు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారని పత్రికల్లో వచ్చిన వార్తలు తెలియజేస్తున్నాయి. ఈ విషయమై బాలుడి టీచర్లను విచారించగా, ఆ బాలుడు వీడియో గేమ్ ఆడుతాడని తోటి పిల్లల ద్వారా తెల్సిందికానీ, ఏ వీడియో గేమ్‌లు ఆడతారో తెలియదని చెప్పారు. తోటి విద్యార్థులు కూడా ఇదే విషయం చెప్పారు. గేమ్‌కు ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు తమకు ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని కేసును దర్యాప్తు చేస్తున్న మెగ్‌వాడి పోలీసు సీనియర్ ఇనిస్పెక్టర్ పాండురంగ్ పాటిల్ చెప్పారు.
దక్షిణ ఢిల్లీలోని హౌజ్ కాస్ ప్రాంతంలో మణిపూర్ మాజీ మంత్రి కుమారుడు, 19 ఏళ్ల యువకుడు ఆగస్టు 12వ తేదీన మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన చావుకు కూడా ఇదే గేమ్ కారణమంటూ వార్తలొచ్చాయి. అది ఆత్మహత్యనే కాదని, ప్రమాదవశాత్తు మేడ మీది నుంచి పడిపోయి మరణించాడని, అందుకే నిర్లక్ష్యం కారణంగా మరణించారని కేసు నమోదు చేశామని కేసును దర్యాప్తు చేస్తున్న అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆగస్టు 10వ తేదీన స్కూల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడని, మరో స్కూల్లో 14 ఏళ్ల బాలుడు కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా ఓ టీచర్ రక్షించాడని వార్తలు వచ్చాయి. వాటికి కూడా బ్లూ వేల్ గేమ్‌ను లింక్ పెట్టారు. వారి ఆత్మహత్య ప్రయత్నాలకు, ఈ వీడియో గేమ్‌కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. అసలు కారణాలేమిటో వెల్లడించడానికి వారి తల్లిదండ్రులుగానీ, టీచర్లుగానీ ఇష్టపడలేదు.
2015 నవంబర్ నెల నుంచి 2016, ఏప్రిల్ మధ్య సంభవించిన 130 పిల్లల ఆత్మహత్యలను విశ్లేషించిన ‘నోవయా గెజెట్టా’ వెబ్‌సైట్, వాటిలో 80 ఆత్మహత్యలకు బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ కారణమంటూ 2016, మే నెలలో ఓ వార్తా కథనం ప్రచురించడంతో ఈ గేమ్ గురించి మొదటి సారి భారత్‌తోపాటు ఇతర ప్రపంచానికి తెల్సింది. ఈ వార్తా కథనంపై అమెరికా ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రేడియో ఫ్రీ యూరప్’ పరిశోధన జరిపి వార్తా కథనానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.