రైలు ప్రయాణాలు ఇక భారం
అందరూ అనుకున్నట్లుగానే రైలు ఛార్జీలు పెరిగాయి. ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం చొప్పున, సరుకు రవాణా ఛార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతూ వస్తుండటం, అలాగే రైల్వే మంత్రి సదానంద గౌడ కూడా రైలు ఛార్జీల పెంపు గురించి ప్రస్తావిస్తుండటం తెలిసిందే. అందుకు అనుగుణంగానే రైలు ఛార్జీలను పెంచారు. పెరిగిన ఛార్జీలు తక్షణం అమలులోకి వచ్చాయని కేంద్రం తెలిపింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల ఛార్జీలు ఇంత పెద్దమొత్తంలో ఎప్పుడూ పెరగలేదు. అటు రవాణాతో పాటు ఇటు ప్రయాణికుల ఛార్జీలను కూడా భారీగా పెంచారు. ప్రధానంగా డీజిల్ ధరలు గణనీయంగా పెరగడం, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగిన నేపథ్యంలో నిర్వహణ వ్యయం పెరిగిపోవడంతో ఛార్జీల పెంపు తప్పలేదని అంటున్నారు. గతంలో రైలు ఛార్జీలను పెంచినప్పుడు ఏకంగా తమ పార్టీకి చెందిన రైల్వే మంత్రితో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా కూడా చేయించారు. ఇప్పుడు ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
కాగా.. రైల్వే బోర్డు ప్రతిపాదించిన మేరకు సరిగ్గా అంతే శాతం చొప్పున ప్రయాణికుల ఛార్జీలను 14.2 శాతం, సరుకు రవాణాను 6.5 శాతం చొప్పున పెంచడం గమనార్హం. దీంతోపాటు రైల్వేలలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్డీఐ)లకు కూడా పచ్చజెండా ఊపాలని సదానందగౌడ భావిస్తున్నట్లు తెలిసింది.