ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ రేపుతున్న బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు

Published Sun, Mar 15 2020 4:36 PM

Congress Shifts MLAs To Jaipur On Head Of Floor Test - Sakshi

భోపాల్‌ : రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ సర్కార్‌ సంకటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ లాల్జీ టాండన్‌ ఆదేశాల మేరకు సోమవారం శాసనసభలో విశ్వాసపరీక్ష జరుపనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్‌ చేరుకున్నారు. జ్యోతిరాదిత్యా సింధియా అనుకూల వర్గంగా భావిస్తున్న వీరంతా బెంగళూరులోని రిసార్టులో ఇన్నిరోజులు గడిపారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్‌ వెంట ఉన్న శాసన సభ్యులను సీఎం కమల్‌నాథ్‌ జైపూర్‌ క్యాంపుకు తరలించారు. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో బీజేపీ భేరసారాలు నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.  (విశ్వాస పరీక్షకు సిద్ధం)

సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌ నర్మద ప్రసాద్‌ ప్రజాపతి సమక్షంలో బలపరీక్ష జరుగనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కమల్‌నాథ్‌ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి.. బలపరీక్షపై అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చర్చించారు. బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్‌ తమ పార్టీ సభ్యులకు విప్‌ జారీచేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌లోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమకు సింధియాపై అభిమానం మాత్రమే ఉందని, ఆయనతో పాటు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఓ తిరుగుబాటు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేకిత్తిస్తున్నాయి. దీంతో 22 మంది కాంగ్రెస్‌ సభ్యుల మద్దతు లభిస్తుందని భావించిన కమళ దళానికి భంగపాటు ఎదురైంది. (ఆ 22 మందికి నోటీసులు)

మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్న ఎస్పీ, బీఎస్సీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇదివరకే సంప్రదింపులు జరిపి.. వారిని బీజేపీ గూటికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరుగురు మంత్రులను కమల్‌నాథ్‌ ఇదివరకే మంత్రిమండలి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు. కాగా మొత్తం 228 సభ్యులు గల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే 22 మంది కాంగ్రెస్‌ సభ్యుల రాజీనామాతో కమల్‌నాథ్‌ సర్కార్‌ మైనార్టీలో పడిపోయింది. (జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!)

Advertisement
 
Advertisement
 
Advertisement