పళనిస్వామికే మెజార్టీ ఉంది...
చెన్నై : అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామికే మెజార్టీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి కోరారు. రాష్ట్రంలో విపక్షాల కుట్రలు సాగవని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని ఆమె బుధవారమిక్కడ అన్నారు. కాగా పళనిస్వామి మంగళవారం సాయంత్రం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే.
గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లి తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందచేసి, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గవర్నర్ విద్యాసాగర్ రావు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గవర్నర్ నిర్ణయం కోసం అన్నాడీఎంకేతో పాటు తమిళనాడు రాష్ట్రం మొత‍్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ ఇవాళ బెంగళూరు పరప్పణ అగ్రహార కోర్టులో లొంగిపోనున్నారు.