నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్త నరికివేత!
కేరళలో మరో రాజకీయ హత్య.. తీవ్ర ఉద్రిక్తత
కొచ్చి: కేరళలో నడిరోడ్డుపై మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్ గురువారం ఉదయం మలప్పురం జిల్లాలో కత్తిపోట్లతో హత్యకు గురై కనిపించాడు. ఇటీవల కేరళలో రాజకీయ హింస పేట్రేగుతున్న నేపథ్యంలో తాజా ఘటన రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు.
ఫైజల్ పుల్లనీ అలియాస్ అనీష్‌కుమార్ హత్యకేసులో విపిన్ నిందితుడిగా ఉన్నాడు. ఎనిమిది నెలల కిందట ఇస్లాం మతంలోకి మారాడన్న కారణంతో ఫైజల్‌ను దుండగులు కొట్టిచంపారు. ఈ దుండగుల బృందంలో ఒకడైన విపిన్ గతవారమే బెయిల్‌పై విడుదలయ్యాడు.
కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యర్థులను కిరాతకంగా హతమారుస్తోందని ఆరెస్సెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే 34 ఏళ్ల ఆరెస్సెస్ కార్యకర్త కిరాతకంగా హత్యకు గురయ్యాడు. సీపీఎం మద్దతుదారులు అతడ్ని చేతులు నరికి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురికావడం కేరళలో ఉద్రిక్తత రేపుతోంది.