హైదరాబాద్ : తమిళనాడులోని తిరువల్లూరు, కృష్ణగిరి జిల్లాలతో పాటు రాజధాని చెన్నై నగరంలో పలుచోట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలు చేపడుతున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయా ప్రాంతాల్లో జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తమిళనాడులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని అభిమానించే వారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారని.. ఆ పెద్దాయన్ని స్మరించుకుంటూ పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారనితెలిపారు. తమిళనాడులో తెలుగు వారు బాష పరంగా, ఇతరేతరా ఎదుర్కొంటున్న పలు సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరినట్టు కేతిరెడ్డి చెప్పారు.