గ్రామస్థాయిలో ఎరువుల గోదాములు | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయిలో ఎరువుల గోదాములు

Published Mon, Jan 3 2022 8:57 AM

AP Govt Decided Build Village Level Warehouse Storage Of Fertilizers - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సాగువేళ రైతులు పడిన ఇబ్బందులకు చెక్‌పెడుతూ వారి ముంగిటకే కావాల్సిన ఎరువులను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎరువుల నిల్వకోసం గ్రామస్థాయిలో గోదాములు నిర్మించాలని సంకల్పించింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత రైతుల ఇబ్బందులకు తెరపడింది.

గతంలో ఎరువుల కోసం గంటల తరబడి సహకార సంఘాలు, వ్యాపారుల  వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ నేడు ఎరువులు రైతులు కోరిన వెంటనే లభిస్తున్నాయి. 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువుల పంపిణీతో రైతులకు భరోసా లభించింది. గత రెండేళ్లలో ఆర్బీకేల ద్వారా 6.9 లక్షలమంది రైతులకు 3.25 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశారు. 

నకిలీ ఎరువులకు చెక్‌ 
పేరున్న కంపెనీల ఎరువులన్నింటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడమేకాదు.. సీజన్‌లో రాష్ట్రానికి కేటాయించిన ప్రతి ఎరువును ముందుగా సమగ్ర పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చేస్తుండడంతో నకిలీలకు చెక్‌ పడింది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు మేరకు ఎంపిక చేసుకున్న ఎరువులను ఎమ్మార్పీకి పొందే వెసులుబాటు లభించింది.

గతంలో మాదిరిగా అవసరంలేని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు పోయాయి. దూరాభారం తగ్గింది. సమయం ఆదా అవుతోంది. రవాణా, ఇతర ఖర్చుల భారం లేకుండా తమ ముంగిటే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలతో రైతులను దోచుకునే ప్రైవేటు డీలర్ల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల లభ్యత, ఎమ్మార్పీ పట్టిక అమలుతో మార్కెట్‌లో ఎరువుల ధరల స్థిరీకరణ సాధ్యమవుతోంది.  

ఆర్బీకేలకే లైసెన్సు 
ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ఆర్బీకేల పేరిట ఎరువుల లైసెన్సు జారీచేస్తున్నారు. వివిధ పంటలు సాగవుతున్న 10,698 ఆర్బీకేల పరిధిలో ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు రిటైల్‌ ఫెర్టిలైజర్‌ లైసెన్సుల కోసం 10,592 ఆర్బీకేలు దరఖాస్తు చేశాయి. వీటిలో 10,454 ఆర్బీకేలకు లైసెన్సు జారీచేశారు. 138 ఆర్బీకేలకు లైసెన్సు ఇవ్వాల్సి ఉంది. మరో 106 ఆర్బీకేలు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉంది. 

జాప్యం నివారణ కోసం 
హబ్‌ల నుంచి ఆర్బీకేలకు ఎరువుల సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా ప్రత్యేకంగా గోదాములు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  కనీసం 20 మెట్రిక్‌ టన్నుల (ఎంటీల) ఎరువులు నిల్వచేసేందుకు వీలుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు.ఉపాధిహామీ పథకం కింద వీటిని నిరి్మంచేందుకు అంచనాలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. 

కరువు తీరా ఎరువులు
గత రబీ సీజన్‌లో 23.47లక్షల ఎంటీల ఎరువులు వినియోగం కాగా ఈ ఏడాది 23,44,780 టన్నులు అవసరమని అంచనా వేశారు. ఖరీఫ్‌లో వాడగా మిగిలిన 6,96,938 ఎంటీల నిల్వలుండగా, కేంద్రం నుంచి గత మూడు నెలల్లో 7,51,706 ఎంటీల ఎరువులు రాష్ట్రానికి కేటాయించారు. ఇప్పటివరకు 8,32,011 ఎంటీల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 6,16,632 ఎంటీల ఎరువులు (యూరియా 2,53,953 ఎంటీలు, డీఏపీ 27,420,  ఎంఒపీ 21,581, ఎస్‌ఎస్‌పీ 50,681, కాంప్లెక్స్‌ 2,58,521, ఇతర ఎరువులు 4,476 ఎంటీలు) అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్‌ నెలకు మరో 3,59,774 ఎంటీల ఎరువులను కేంద్రం కేటాయించింది. 

ఎరువులకు బెంగలేదు 
4 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నా. గతంలో ఎరువులు కావాలంటే ఉయ్యూరు వెళ్లి ప్రైవేట్‌ డీలర్‌ వద్ద కొని ఆటోలో తెచ్చుకునేవాడిని. పైగా అడిగిన ఎరువులుండేవి కావు. వారు ఇచ్చినవి తెచ్చుకోవాల్సి వచ్చేది. నాణ్యత తెలిసేది కాదు. కానీ నేడు మా గ్రామంలో ఆర్బీకే పెట్టిన తర్వాత ఎరువుల విషయంలో బెంగలేదు. మాకు కావాల్సిన ఎరువులు ముందుగానే టెస్ట్‌ చేసినవి ఎమ్మార్పీకే దొరుకుతున్నాయి. ఆటో ఖర్చులు మిగిలుతున్నాయి. – బసివిరెడ్డి, చిన్న ఓగిరాల, కృష్ణా జిల్లా 

బస్తాకు రూ.30 ఖర్చయ్యేది 
నేను నంబూరులో 3 ఎకరాల్లో వరి, పెసర సాగుచేస్తున్నా. సీజన్‌లో ఎరువులు కావాలంటే గతంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లే వాళ్లం. రవాణా కోసం బస్తాకు రూ.30 ఖర్చయ్యేది. మా నంబూరులో ఏర్పాటు చేసిన ఆర్బీకే ద్వారా నాణ్యమైన ఎరువులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడమే కాదు.. సమయం కూడా ఆదా అవుతోంది. ఎరువుల దొరకవనే ఆందోళన లేదు. – నంబూరి రాంబాబు, నంబూరు, గుంటూరు జిల్లా  

 
Advertisement
 
Advertisement