ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం  | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్నిక పర్యాటకం.. ఆర్థిక వృద్ధికి దోహదం 

Published Tue, Mar 5 2024 5:13 AM

AP Govt Unveils Temple Tourism - Sakshi

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆలయాల సందర్శన 

14 శాతం పెరిగిన విరాళాల వాటా 

ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన 

2023–30 మధ్య 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు నమోదు అంచనా 

ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు ప్రోత్సాహం 

అత్యధికంగా తిరుమలకు ఏటా 2.50 కోట్ల మంది రాక  

ప్రత్యేక రెలిజియస్‌ టూరిజంను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం 

దేశ వ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు దేశ విదేశాల నుంచి భక్తులు నిరంతరం పోటెత్తుతున్నారు. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కూడా వేగంగా జరుగుతోంది. చిన్న చిన్న పరిశ్రమలకు, వృత్తి కళాకారులకు చేతినిండా పనిదొరుకుతోంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కూడా ఆధ్మాత్నిక పర్యాటకానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఆధ్మాత్మిక పర్యాటకంతో స్థానిక వ్యాపారులకు పెద్దఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తన ప్రసంగంలో కూడా చెప్పారు.  

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఏటా ఆధ్యాత్నిక పర్యాటకం పెరుగుతోంది. ప్రఖ్యాత ఆలయాలు, ప్రదేశాలు యాత్రికులను ఆకర్షించడమే కాకుండా ఆర్థిక వృద్ధికి ఉ్రత్పేరకంగా మారుతున్నాయి. కోవిడ్‌ మహమ్మారి తర్వాత భారతీయుల్లో ఆధ్యాత్నిక భావనలు, భక్తి విశ్వాసాలు మరింత బలపడినట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2022లో తీర్థయాత్ర కోసం ప్రయాణాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. దేశంలో ఆధ్యాత్నిక కేంద్రాలకు వచ్చే విరాళాల వాటా 14 శాతం పెరిగింది. ఈ క్రమంలోనే 2023–30 మధ్యకాలంలో దాదాపు 16 శాతానికిపైగా వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌)ను అధిగమిస్తోందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని పురాతన ఆలయాలు, క్షేత్రాలు ఆధ్యాత్నిక పర్యటనలకు స్వర్గధామంగా మారాయి.  

విస్తృతంగా ఉద్యోగాల కల్పన 
ఆధ్యాత్నిక పర్యటన భక్తితో పాటు దేశంలోని నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోంది. ఆధ్యాత్నిక హాట్‌ స్పాట్స్‌లో భక్తుల అవసరాలను తీర్చేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు వస్తున్నాయి. తద్వారా పాకశాస్త్ర కళలు, ఈవెంట్‌ ప్లానింగ్‌ వరకు ఆతిధ్య పరిశ్రమలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ లెక్కల ప్రకారం దేశంలో 2022లో వంద కోట్ల మంది పర్యాటకులు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇందులో ఆధ్యాత్మిక ప్రదేశాలు సుమారు రూ. 1.34 లక్షల కోట్లు ఆర్జించాయి. ఎక్కువగా విదేశీలు భారతీయ సంస్కృతి, ఆలయాల చరిత్రను తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఇక్కడకి వస్తున్నారు.

అందుకే ఈ రంగం 2030 నాటికి 14 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, బిహార్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఉద్యోగాల సృష్టికి ఆలయాలు చోదక శక్తిగా ఉంటాయని విశ్వసిస్తున్నారు. ఆధ్యాత్నిక పర్యటనల్లో ప్రయాణం, ఆతిథ్యం, పర్యాటక పరిశ్రమల్లో చిన్న సంస్థలకు మేలు జరుగుతుంది. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూ­రిజం ఆర్గనైజేషన్‌ (యూఎన్‌డబ్ల్యూటీఓ)సైతం తరచుగా సంస్కృతి అన్వేషణలో భా­గంగా ఆధ్యాత్నికతలో కొత్త అనుభవాలు కో­రుకునేవారు పెరుగుతున్నట్టు గుర్తించింది.  

టాప్‌లో తిరుపతి.. 
దేశ ఆధ్యాత్నిక పర్యాటకంలో అయోధ్య రామ మందిరం రిలీజియస్‌ టూరిజంలో కీలక మార్పులు తీసుకొస్తోందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పర్యాటకులకు అదనంగా 5 నుంచి 10 కోట్ల మందికిపైగా భారత్‌ను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. తాజ్‌ మహల్‌ (65 లక్షలు), రోమ్‌లోని వాటికన్‌ సిటీ (90 లక్షలు), సౌదీ అరేబియాలోని మక్కా (2 కోట్లు) వార్షిక సందర్శకుల సంఖ్యల కంటే అయోధ్య ప్రత్యేకంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవాలయం ఏడాదికి 2.50 కోట్ల మంది సందర్శకులతో టాప్‌లో నిలుస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం 80 లక్షల మంది సందర్శకులతో అలరాలుతోంది. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో బలమైన ఆధ్యాత్నిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. 

ఏపీలోనూ ప్రత్యేక సర్క్యూట్లు 
ఆంధ్రప్రదేశ్‌ ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద విభాగంగా ఉంది.ం మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక ప్రభావాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), దేవదాయశాఖ సంయుక్తంగా ‘రిలీజియస్‌ టూరిజం’ను ప్రవేశపెట్టాయి. తిరుమల, మహానంది, శ్రీశైలం, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, విజయవాడ, మంగళగిరి, కోటప్పకొండ, మంత్రాలయం, లేపాక్షి, కదిరి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చింది. నిత్యం ఆధ్యాత్నిక పర్యటనలను ప్రోత్సహించేలా భక్తులకు నచి్చన ఆలయాలను కలుపుతూ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతిలో భక్తులకు చింతలేని దర్శనాన్ని కల్పించడం కోసం బ్యాకెండ్‌ సేవలను ప్రారంభించింది. సర్క్యూట్‌ టూరిజంలో భాగంగా 100కి పైగా ఆలయాల జాబితాను సిద్ధం చేసింది. దశల వారీగా ఆధ్యాత్నిక టూర్లను అందుబాటులోకి తెస్తోంది.

Advertisement
Advertisement