ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.
రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్‌లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
ముంబైలోని ఘాట్‌కోపర్‌లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment