
సాక్షి, ముంబై: మంగళవారం ఉదయం ముంబైలో ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా అంధేరీ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్‌పై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.
శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావించిన అధికారులు.. వాటిని తొలగించేశారు. మరోవైపు బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. వేలాది మంది ఈ వంతెనను వినియోగిస్తుంటారు. అయితే వేకువ ఝామున ప్రమాదం జరగటం, రద్దీ లేకపోవటంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారి తెలిపారు. ఘటనలో ఇప్పటిదాకా ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వేశాఖ వెంటనే చర్యలు చేపట్టింది.