Andheri railway station
-
మన ఫ్లైఓవర్లు పదిలమేనా?
సాక్షి,సిటీబ్యూరో: ముంబై అంధేరి స్టేషన్‌లోని బ్రిడ్జి కూలిన ఘటనతో నగరంలోని ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల పటిష్టత, భద్రత అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలో 30కి పైగా ఫ్లై ఓవర్లున్నాయి. వీటిని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నిర్మించాయి. ఆ తర్వాత మాత్రం నిర్వహణను మరచిపోవడంతో వీటిల్లో నాలుగైందింటి పరిస్థితి దారుణంగా ఉందని, తక్షణ మరమ్మతులవసరమని ఇంజినీర్లు భావిస్తున్నారు. వీటికి మరమ్మతులవసరమని దాదాపు ఐదేళ్ల క్రితమే గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలానికి ముందు, తర్వాత కూడా ఫ్లై ఓవర్ల స్థితిగతులను పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేయాల్సి ఉండగా, నగరంలో ఆ పని జరగడం లేదు. నగరంలో నిర్మించిన ఫ్లై ఓవర్లలో ఇప్పటివరకు ఒక్క డబీర్‌పురా ఫ్లై ఓవర్‌కు మాత్రం పూర్తిస్థాయి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం లాలాపేట్ ఫ్లై ఓవర్ మరమ్మతులు జరుగుతున్నాయి. దాదాపు రూ.5.8 కోట్లతో నెలన్నర క్రితం చేపట్టిన పనులు పూర్తయ్యేందుకు మరో నాలుగైదునెలల సమయం పట్టనుంది. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌కు నాలుగేళ్ల క్రితం స్వల్ప మరమ్మతులు మాత్రం చేశారు. పూర్తి మర్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం దాంతోపాటు తెలుగుతల్లి, హఫీజ్‌పేట, మాసాబ్‌ట్యాంక్ ఫ్లై ఓవర్లకు కూడా మరమ్మతులు అవసరమని ఇంజినీర్లు భావిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు, తదితర కారణాలతో ఎప్పటికప్పుడు ఈ మరమ్మతు పనుల్ని వాయిదా వేస్తున్నారు. సాధారణంగా ఫ్లై ఓవర్లలోని గర్డర్స్ ప్రాంతాల్లో కాంక్రీట్ దెబ్బతింటుంది. బేరింగులు అరిగిపోతాయి. ఎక్స్పాన్షన్ జాయింట్స్ వదులై బలహీనంగా మారుతుంది. స్తంభాల పైభాగాలు(పయర్ క్యాప్స్) తుప్పుపడుతాయి. బాక్స్‌గర్డర్స్ ఏటవాలు గోడల్లో పగుళ్లు ఏర్పడుతాయి. నిర్ణీత వ్యవధుల్లో వీటికి మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పటికీ ఆపని జరగడం లేదు. ఒక్కో ఫ్లై ఓవర్‌కు దాదాపు 15–20 స్పాన్‌లుంటాయి. వాటిల్లో ఉండే బేరింగ్లను జాకీలు ఏర్పాటుచేసి మార్చాల్సి ఉంటుంది. వాస్తవానికి వీటి నిర్వహణ బాధ్యతలు చూడటంతోపాటు నిర్ణీత వ్యవధుల్లో తగిన మరమ్మతులు చేపట్టేందుకు స్పెషల్ డివిజన్ ఉండాలి. కానీ నగరంలో అది లేదు. జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగానికి ఉన్నబోలెడు పనులతో వీటిపై దృష్టి సారించే పరిస్థితి లేదు. ఏ సంస్థ నిర్మించిన ఫ్లై ఓవర్ల మరమ్మతుల్ని ఆ సంస్థే చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దాదాపు 15 సంవత్సరాల వరకు మరమ్మతులు చేసే అవసరం రాకున్నా..15 ఏళ్ల తర్వాత మాత్రం తప్పనిసరిగా పరిశీలించి పనులు చేయాలని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. నగరంలోని ఫ్లై ఓవర్లలో దాదాపు పది ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి దాదాపు ఇరవయ్యేళ్లు అవుతోంది. అలాంటి వాటిల్లో బేగంపేట, బషీర్‌బాగ్, తార్నాక, హరిహరకళాభవన్, సీటీఓ, మాసాబ్‌ట్యాంక్ తదతరమైనవి ఉన్నాయి. వీటన్నింటిని కూడా పరిశీలించి మరమ్మతులు చేయాల్సి ఉంది. ఫ్లై ఓవర్లపై పడే గుంతల్ని పూడ్చేందుకు పైపొరలుగా కోటింగ్స్ వేస్తూ పోతుండటంతో కొన్ని ఫ్లై ఓవర్ల మందం ఎంతో ఎత్తు పెరిగిపోయింది. దీని వల్ల కూడా ఫ్లై ఓవర్లు ప్రమాదకరంగా మారే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నగరంలోని ఫ్లై ఓవర్లకు మరమ్మతులు చేపట్టే యోచనలో ఉన్నామని, పెరిగిన మందాన్ని పూర్తిగా తొలగించే ఆలోచన కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదాలు జరగక ముందే మరమ్మతులు చేయాల్సిన అవసరముంది. -
ముంబైలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, ముంబై: మంగళవారం ఉదయం ముంబైలో ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా అంధేరీ రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్‌పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్‌పై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావించిన అధికారులు.. వాటిని తొలగించేశారు. మరోవైపు బ్రిడ్జిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. వేలాది మంది ఈ వంతెనను వినియోగిస్తుంటారు. అయితే వేకువ ఝామున ప్రమాదం జరగటం, రద్దీ లేకపోవటంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారి తెలిపారు. ఘటనలో ఇప్పటిదాకా ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వేశాఖ వెంటనే చర్యలు చేపట్టింది. -
ప్రయాణికులకు చుక్కలు చూపిన ఏసీ ట్రైన్
ముంబై : ముంబైలో ఓ లోకల్ ఏసీ సర్వీస్ రైలు శుక్రవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ట్రైన్‌లోని కొన్ని కోచ్‌లలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం బోరివాలి స్టేషన్ దాటక ట్రైన్లో ఒక్కసారిగా కొన్ని కోచ్‌లలో ఏసీలు ఆగిపోవడంతో.. ఉష్ణోగ్రత క్రమంగా 36 డిగ్రీలకు చేరుకుంది. ట్రైన్ డోర్లు మూసి ఉండేవి కావడంతో ఊపిరాడక, ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగ్రహా, ఆవేశాలకు లోనైనా కొందరు ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ని అంధేరిలో నిలిపివేశారు. ట్రైన్‌ను పరిశీలించిన అధికారులు.. ఏసీ ఫెయిల్ కావడానికి కారణాలు తెలియకపోవడంతో దానిని షెడ్‌కు తరలించారు. ఈ సమస్యను ప్రయాణికులు ట్విటర్లో రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వే శాఖ ఈ ఘటనపై క్షమాపణ తెలిపింది.3 కోచ్‌లలో ఈ సమస్య తలెత్తినట్టుగా పేర్కొంది. పశ్చిమ రైల్వే ముంబైలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి గతేడాది డిసెంబర్లో 12 ఏసీ సర్వీస్‌లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుడు ట్వీట్ వల్ల ఐపీఎల్లో బంగారు భవిష్యత్తు కాస్తా నాశనం అయిపోయింది. కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ హర్‌ప్రీత్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేసిన హర్‌ప్రీత్.. మధ్యప్రదేశ్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంధేరి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు కారుతో దూసుకెళ్లిన వ్యక్తి అతడేనని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఒక తప్పుడు ట్వీట్ రావడంతో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా హర్‌ప్రీత్‌ను తీసుకోలేదు. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్లకు ఆడిన హర్‌ప్రీత్ నిజానికి ఏ కేసులోనూ అరెస్టు కాలేదు. ముంబైలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లింది అతడు కాదు, హర్మీత్ సింగ్ అనే మరో యువ క్రికెటర్. అతడు ఇండియా అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. పేరు దగ్గరగా ఉండటంతో హర్ప్రీతే ఈ నేరం చేశాడంటూ ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరింది. నిజానికి తాము హర్‌ప్రీత్‌ను కొందామనుకున్నామని, కానీ అతడి అరెస్టు వార్తలు విని ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ఊరుకున్నామని.. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు నేరస్తుడు హర్‌ప్రీత్ కాదు, హర్మీత్ అన్న విషయం తెలిసిందని ఒక ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇప్పుడు తన పేరుతో పాటు తన కెరీర్ కూడా పాడైపోయిందని, ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలని హర్‌ప్రీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను ఐపీఎల్ గురించి బాధ పడట్లేదని, చివరకు గూగుల్‌లో తన పేరు సెర్చ్ చేసినా తాను అరెస్టయినట్లే వస్తోందని అన్నాడు. -
క్రికెటర్ అరెస్ట్.. మూడేళ్లు శిక్ష పడే అవకాశం
ముంబై: అండర్-19 క్రికెటర్ హర్మీత్ సింగ్ బదహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరీ రైల్వే స్టేషన్ లోకి కారుతో సహా చొచ్చుకుని వచ్చినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం 7. 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్మీత్ తన హ్యుందాయ్ సెడాన్ కారు సహా ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చాడు. కారు నేరుగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీ సమయంలో ఈ ఘటన జరిగితే పరిస్థితి దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినందుకు హర్మీత్ ను అరెస్ట్ చేశామని అంధేరీ ఆర్పీఎఫ్ సీనియర్ ఇన్స్ పెక్టర్ మనీశ్ రాథోడ్ తెలిపారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 154 కింద అతడిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. నేరం రుజువైతే అతడికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.