క్రికెటర్ అరెస్ట్.. మూడేళ్లు శిక్ష పడే అవకాశం
ముంబై: అండర్-19 క్రికెటర్ హర్మీత్ సింగ్ బదహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరీ రైల్వే స్టేషన్ లోకి కారుతో సహా చొచ్చుకుని వచ్చినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం 7. 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హర్మీత్ తన హ్యుందాయ్ సెడాన్ కారు సహా ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చాడు. కారు నేరుగా ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు తక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీ సమయంలో ఈ ఘటన జరిగితే పరిస్థితి దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లఘించినందుకు హర్మీత్ ను అరెస్ట్ చేశామని అంధేరీ ఆర్పీఎఫ్ సీనియర్ ఇన్స్ పెక్టర్ మనీశ్ రాథోడ్ తెలిపారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 154 కింద అతడిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. నేరం రుజువైతే అతడికి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.