ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
Published Fri, Feb 24 2017 3:49 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుడు ట్వీట్ వల్ల ఐపీఎల్‌లో బంగారు భవిష్యత్తు కాస్తా నాశనం అయిపోయింది. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ హర్‌ప్రీత్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేసిన హర్‌ప్రీత్.. మధ్యప్రదేశ్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంధేరి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు కారుతో దూసుకెళ్లిన వ్యక్తి అతడేనని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఒక తప్పుడు ట్వీట్ రావడంతో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా హర్‌ప్రీత్‌ను తీసుకోలేదు. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్లకు ఆడిన హర్‌ప్రీత్ నిజానికి ఏ కేసులోనూ అరెస్టు కాలేదు.
ముంబైలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లింది అతడు కాదు, హర్మీత్ సింగ్ అనే మరో యువ క్రికెటర్. అతడు ఇండియా అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. పేరు దగ్గరగా ఉండటంతో హర్‌ప్రీతే ఈ నేరం చేశాడంటూ ఎవరో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరింది. నిజానికి తాము హర్‌ప్రీత్‌ను కొందామనుకున్నామని, కానీ అతడి అరెస్టు వార్తలు విని ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ఊరుకున్నామని.. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు నేరస్తుడు హర్‌ప్రీత్ కాదు, హర్మీత్ అన్న విషయం తెలిసిందని ఒక ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.
ఇప్పుడు తన పేరుతో పాటు తన కెరీర్ కూడా పాడైపోయిందని, ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలని హర్‌ప్రీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను ఐపీఎల్ గురించి బాధ పడట్లేదని, చివరకు గూగుల్‌లో తన పేరు సెర్చ్ చేసినా తాను అరెస్టయినట్లే వస్తోందని అన్నాడు.
Advertisement