Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా జనవరి 3న ప్రారంభమైన గ్రూప్ మ్యాచ్‌ల్లో మిగతా జట్లతో పాటు విదర్భ-మధ్యప్రదేశ్ జట్లు కూడా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలి బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రజత్ పాటిదార్ (121) శతకంతో, సరాన్ష్ జైన్ (61) హాఫ్ సెంచరీతో రాణించడంతో మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, లలిత్ యాదవ్, సర్వటే చెరో 2 వికెట్లు, భుటే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ ధాటికి చిగురుటాకులా వణికింది. ఆవేశ్.. తాను వేసిన 22 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ ధాటికి విదర్భ 160 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో సంజయ్ రఘునాథ్ (58) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.
అతను మినహా మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆవేశ్ ఖాన్ టీమిండియాలో చోటే లక్ష్యంగా సాగాడు. అతనికి జతగా జి యాదవ్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఆవేశ్ ఖాన్.. టీమిండియా తరఫున 5 వన్డేలు, 15 టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఇందులో అతను మొత్తంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇండోర్ బౌలర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌లో కొనసాగుతున్నాడు. ఆవేశ్.. తన ఐపీఎల్ కెరీర్‌లో 38 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment