మయాంక్ యాదవ్ (PC: IPL/LSG)
భారత యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ శుభవార్త పంచుకున్నాడు. గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించాడు. అయితే, పూర్తి ఫిట్‌నెస్ సాధించాలంటే మరికొంత కాలం చెమటోడ్చక తప్పదని పేర్కొన్నాడు.
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటిన ఈ యంగ్ పేస్‌గన్.. వరుసగా రెండు మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు.
రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యూపీ ఎక్స్‌ప్రెస్ రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
అయితే, దురదృష్టవశాత్తూ పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్-2024లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు మయాంక్ యాదవ్. ప్రస్తుతం అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు.
వందశాతం ఫిట్‌నెస్ సాధించాలంటే
ఈ నేపథ్యంలో టెలిగ్రాఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘నా చికిత్స పూర్తైంది. గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇక్కడ నాకు ఉపశమనం లభించింది.
పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది. అయితే, వందశాతం ఫిట్‌నెస్ సాధించాలంటే మరికొంత కాలం ఇక్కడ ఉండక తప్పదని తెలుసు.
గత కొన్ని రోజులుగా పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయడం సానుకూలాంశం. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
రీఎంట్రీ అప్పుడే
కాగా పేస్ సంచలనం మయాంక్ యాదవ్‌పై దృష్టి సారించిన సెలక్టర్లు అతడి పునరాగమనం కోసం వేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దులీప్ ట్రోఫీ- 2024 ద్వారా ఈ బౌలర్ రీఎంట్రీ ఇస్తే.. ఆ ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులో చోటు ఇచ్చే అంశం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అరంగేట్రం ఆ తర్వాతే
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘మయాంక్ యాదవ్ వంటి అద్భుత నైపుణ్యాలున్న ఫాస్ట్‌బౌలర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేము. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత వేర్వేరు ఫార్మాట్లలో ఆడించాలనుకుంటున్నాం.
అక్కడ ప్రతిభ నిరూపించుకున్న తర్వాతే టీమిండియా అరంగేట్రం గురించి స్పష్టత వస్తుంది. అంతేతప్ప హడావుడిగా జాతీయ జట్టులోకి పంపితే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు’’ అని పేర్కొన్నాయి. కాగా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా తదుపరి శ్రీలంకతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment