madhya pradesh cricketer
-
నిప్పులు చెరిగిన ఆవేశ్ ఖాన్.. 7 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా బౌలర్
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా జనవరి 3న ప్రారంభమైన గ్రూప్ మ్యాచ్‌ల్లో మిగతా జట్లతో పాటు విదర్భ-మధ్యప్రదేశ్ జట్లు కూడా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలి బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రజత్ పాటిదార్ (121) శతకంతో, సరాన్ష్ జైన్ (61) హాఫ్ సెంచరీతో రాణించడంతో మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, లలిత్ యాదవ్, సర్వటే చెరో 2 వికెట్లు, భుటే ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ ధాటికి చిగురుటాకులా వణికింది. ఆవేశ్.. తాను వేసిన 22 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ ధాటికి విదర్భ 160 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో సంజయ్ రఘునాథ్ (58) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అతను మినహా మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆవేశ్ ఖాన్ టీమిండియాలో చోటే లక్ష్యంగా సాగాడు. అతనికి జతగా జి యాదవ్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఆవేశ్ ఖాన్.. టీమిండియా తరఫున 5 వన్డేలు, 15 టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఇందులో అతను మొత్తంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇండోర్ బౌలర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌లో కొనసాగుతున్నాడు. ఆవేశ్.. తన ఐపీఎల్ కెరీర్లో 38 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. -
షేన్ వార్న్‌లా గుండెపోటుకు గురైన మరో క్రికెటర్.. గంటన్నరలో 40 సార్లు..!
Madhya Pradesh Cricketer Had Heart Attack In Clinic: ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటు సమస్య అన్ని వయస్కుల వారి ప్రాణాలను హరిస్తుంది. నిత్యం మైదానంలో గడుపుతూ, పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్న వారిని కూడా ప్రాణాంతక సమస్య వదిలి పెట్టడం లేదు. ఇటీవలి కాలంలో క్రికెటర్లు ఎక్కువగా హార్ట్ ఎటాక్ బారిన పడటమే ఇందుకు ఉదాహరణ. మొన్నటికి మొన్న కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు గుండెపోటు కారణంగా ఆస్పత్రి పాలవ్వగా.. తాజాగా దిగ్గజ స్పిన్నర్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అదే గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న బేతుల్‌లోని ఆమ్లాలో నివసిస్తున్న 25 ఏళ్ల క్రికెటర్‌కు విపరీతమైన ఛాతీ నొప్పి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో నొప్పి భరించలేని స్థాయికి వెల్లడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ కోసం రిసెప్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ యువకుడికి గంటన్నర సమయంలో ఏకంగా నలభై సార్లు గుండె ఆగిపోయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మరో డాక్టర్ యువకుడికి ప్రథమ చికిత్స అందించి ఐసీయులోకి తీసుకెళ్లాడు. కార్డియాక్ మసాజ్‌తో పాటు కరెంట్ షాక్ లాంటివి ఇస్తూ అతని గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాగా, ప్రధమ చికిత్స అనంతరం ఆ యువకుడిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించగా గుండెలో 80 శాతం బ్లాకేజ్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడు. చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..! -
ఒక తప్పుడు ట్వీట్.. ఎంతపని చేసింది!
ఎవరో ఒక వ్యక్తి చేసిన తప్పుడు ట్వీట్ వల్ల ఐపీఎల్లో బంగారు భవిష్యత్తు కాస్తా నాశనం అయిపోయింది. కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుదామని భావించిన మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ హర్‌ప్రీత్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. రంజీ ట్రోఫీలో 8 మ్యాచ్‌లు ఆడి 537 పరుగులు చేసిన హర్‌ప్రీత్.. మధ్యప్రదేశ్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అంధేరి రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు కారుతో దూసుకెళ్లిన వ్యక్తి అతడేనని, అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారని ఒక తప్పుడు ట్వీట్ రావడంతో ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా హర్‌ప్రీత్‌ను తీసుకోలేదు. ఇంతకుముందు కోల్‌కతా నైట్ రైడర్స్, పుణె వారియర్స్ జట్లకు ఆడిన హర్‌ప్రీత్ నిజానికి ఏ కేసులోనూ అరెస్టు కాలేదు. ముంబైలో రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లింది అతడు కాదు, హర్మీత్ సింగ్ అనే మరో యువ క్రికెటర్. అతడు ఇండియా అండర్-19 జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. పేరు దగ్గరగా ఉండటంతో హర్ప్రీతే ఈ నేరం చేశాడంటూ ఎవరో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యి ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా చేరింది. నిజానికి తాము హర్‌ప్రీత్‌ను కొందామనుకున్నామని, కానీ అతడి అరెస్టు వార్తలు విని ఫ్రాంచైజీకి చెడ్డపేరు వస్తుందన్న ఆలోచనతో ఊరుకున్నామని.. కానీ వేలం ముగిసిన తర్వాత అసలు నేరస్తుడు హర్‌ప్రీత్ కాదు, హర్మీత్ అన్న విషయం తెలిసిందని ఒక ఫ్రాంచైజీ అధికారి తెలిపారు. ఇప్పుడు తన పేరుతో పాటు తన కెరీర్ కూడా పాడైపోయిందని, ఇప్పుడు దాన్నుంచి ఎలా బయటపడాలని హర్‌ప్రీత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తనకు ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడుగుతున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను ఐపీఎల్ గురించి బాధ పడట్లేదని, చివరకు గూగుల్‌లో తన పేరు సెర్చ్ చేసినా తాను అరెస్టయినట్లే వస్తోందని అన్నాడు.