
Madhya Pradesh Cricketer Had Heart Attack In Clinic: ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా గుండెపోటు సమస్య అన్ని వయస్కుల వారి ప్రాణాలను హరిస్తుంది. నిత్యం మైదానంలో గడుపుతూ, పూర్తి ఫిట్ నెస్‌తో ఉన్న వారిని కూడా ప్రాణాంతక సమస్య వదిలి పెట్టడం లేదు. ఇటీవలి కాలంలో క్రికెటర్లు ఎక్కువగా హార్ట్ ఎటాక్ బారిన పడటమే ఇందుకు ఉదాహరణ.
మొన్నటికి మొన్న కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు గుండెపోటు కారణంగా ఆస్పత్రి పాలవ్వగా.. తాజాగా దిగ్గజ స్పిన్నర్, స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అదే గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 21న బేతుల్‌లోని ఆమ్లాలో నివసిస్తున్న 25 ఏళ్ల క్రికెటర్‌కు విపరీతమైన ఛాతీ నొప్పి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో నొప్పి భరించలేని స్థాయికి వెల్లడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో డాక్టర్ కోసం రిసెప్షన్ వద్ద వెయిట్ చేస్తున్న ఆ యువకుడికి గంటన్నర సమయంలో ఏకంగా నలభై సార్లు గుండె ఆగిపోయింది.
దీంతో వెంటనే అలర్ట్ అయిన మరో డాక్టర్ యువకుడికి ప్రథమ చికిత్స అందించి ఐసీయులోకి తీసుకెళ్లాడు. కార్డియాక్ మసాజ్‌తో పాటు కరెంట్ షాక్ లాంటివి ఇస్తూ అతని గుండెను మళ్లీ కొట్టుకునేలా చేశాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. కాగా, ప్రధమ చికిత్స అనంతరం ఆ యువకుడిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించగా గుండెలో 80 శాతం బ్లాకేజ్ ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడు.
చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!