ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సత్తాచాటింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.
దీంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఢిల్లీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇతర జట్ల గెలుపోటములుపై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ఢిల్లీ బ్యాటర్లలో అభిషేక్ పోరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వారిద్దరితో పాటు షాయ్ హోప్(38), కెప్టెన్ రిషబ్ పంత్(33) పరుగులతో రాణించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.
చెలరేగిన ఇషాంత్..
అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 పరుగులకే పరిమితమైంది. లక్నో టెయిలాండర్ అర్షద్ ఖాన్ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
7వ స్ధానంలో బ్యాటింగ్‌లో వచ్చిన అర్షద్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లక్ష్య చేధనలో 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్.. గెలుపు అంచుల దాకా తీసుకువచ్చాడు. 33 బంతులు ఎదుర్కొన్న అర్షద్.. 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు.
అతడితో పాటు నికోలస్ పూరన్(61) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ మూడు వికెట్లు, ఖాలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, స్టబ్స్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment