భద్రతపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

భద్రతపై ప్రత్యేక దృష్టి

Published Tue, Oct 3 2023 5:02 AM

Awareness campaigns on electrical hazards - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రత్యేక దృష్టి సారించాయి. విద్యుత్‌ భద్రతపై ఇప్పటికే అనేక సూచనలను ప్రజలకు ఇచ్చినప్పటికీ ఇంకా అక్కడక్కడా విద్యుత్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా కొంతమంది విద్యుత్‌ సిబ్బందితోపాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో విద్యుత్‌ ప్రమాదాలు జరిగిన తరువాత సమీక్షించుకోవడం కాకుండా వాటిని అరికట్టేందుకు పటిష్ట చర్యల్ని అమలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయి. వినియోగదారులకు ప్రత్యేకంగా భద్రతా సూచనల్ని రూపొందించాయి. భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల యజమానులు, రైతు కూలీలు, ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాల డ్రైవర్లకు ప్రత్యేకంగా సూచనలను రూపొందించాయి. వీటిని అందరికీ తెలియజేసేందుకు ‘భద్రతా అవగాహనా రథం’ పేరుతో ప్రత్యేక ప్రచార వాహనాలను ప్రారంభిస్తున్నాయి.  

విద్యుత్‌ సిబ్బందికీ జాగ్రత్తలు 

  •  లైన్‌ క్లియర్‌ (ఎల్‌సీ) సరిగ్గా లేకుండా ఏ లైన్‌ మీద పని చేయరాదు. సమీపంలో వేరే లైన్‌ ఉంటే దానికి కూడా ఎల్‌సీ తీసుకోవాలి. 
  • విద్యుత్‌ లైన్ల నిర్వహణ, బ్రేక్‌ డౌన్‌ ఆపరేషన్స్, ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌ చేసే సమయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్‌ సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్, రబ్బర్‌ గ్లవ్స్, గమ్‌ బూట్స్, సేఫ్టీ బెల్ట్స్‌ వంటి భద్రతా పరికరాలు వినియోగించాలి. అలాగే ఒక్కరే ఎప్పుడూ వెళ్లకూడదు. వేరొకరిని తోడు తీసుకువెళ్లాలి. 
  • పంట పొలాలకు అనధికార విద్యుత్‌ కంచెలు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం. అటువంటివి లేకుండా సిబ్బంది తరచూ తనిఖీలు చేపట్టాలి. 
  • సబ్‌ స్టేషన్‌ ఆవరణలో గొడుగు వేసుకుని వెళ్లకూడదు. కడ్డీలు, తీగలు వంటివి తగిన జాగ్రత్తలు లేకుండా తీసుకుపోకూడదు. 
  • కొత్త సర్విస్‌ ఇచ్చేటప్పుడు ఆ ఇల్లు విద్యుత్‌ లైన్‌ కింద ప్రమాదకరంగా ఉంటే ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ సెక్షన్‌ 48, క్లాజ్‌ 63 ఆఫ్‌ రెగ్యులేషన్స్‌ 2010 ప్రకారం సర్వీసును తిరస్కరించి లైన్‌ షిఫ్ట్‌ చేయాలి.

భవన నిర్మాణ కార్మికులకు ఇవీ సూచనలు 

  •  విద్యుత్‌ లైన్లు కింద ఎటువంటి నిర్మాణాలు చేయ­రాదు. విద్యుత్‌ స్తంభానికి సమీపంలో లేదా స్తంభానికి ఆనుకుని ఇల్లు, ఎలివేషన్, డూములు, మెట్లు నిర్మాణం చేయకూడదు.  
  • ఇనుప చువ్వలు, లోహ పరికరాలు విద్యుత్‌ లైన్లు కింద తప్పనిసరి పరిస్థితులలో ఎత్తినపుడు జాగ్రత్తగా చూసుకోవాలి. 
  •  జేసీబీలు, క్రేన్లు ఉపయోగించేటప్పుడు, బోర్లు డ్రిల్‌ చే­స్తున్నప్పుడు వాటి లోహపు తొట్టెలు, పైపులు విద్యుత్‌ లైన్లకు తగిలి ప్రాణాపాయం సంభవించవచ్చు. 
  • ధాన్యం, ప్రత్తి, గడ్డి, ఊక, కొబ్బరి చిప్పలు, కలప వంటి  వాహనాలు అధిక లోడుతో విద్యుత్‌ లైన్లు కింద వెళ్లడం ప్రమాదకరం. 

సామాన్య ప్రజలకూ హెచ్చరికలు 

  • విద్యుత్‌ సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే లైన్ల కింద చెట్టు కొమ్మలు తొలగించాలి. 
  •  తెగిపడి ఉన్న విద్యుత్‌ వైర్లను తాకకూడదు. 
  • ఇల్లు, షాపు మీటర్‌కి పోల్‌ నుంచి తీసుకొనే సర్విస్‌ వైరు­కి ఎటువంటి అతుకులు లేకుండా చూసుకోవాలి.  
  •  సర్వీస్‌ వైరుకి సపోర్ట్‌ వైరుగా రబ్బరు తొడుగు గల జీఐ తీగలను వాడాలి. ఇంటి ఆవరణలో ఎర్తింగ్‌ తప్పనిసరి. 
  • డాబాల మీద విద్యుత్‌ లైన్లకి దగ్గరగా బట్టలు ఆరవేయరాదు. తడి బట్టలతో, తడి చేతులతో విద్యుత్‌ పరికరాలను తాకకూడదు. 
  • వర్షం పడుతున్నప్పుడు విద్యుత్‌ స్తంభాన్ని,సపోర్ట్‌ వైర్లను ముట్టుకోకూడదు. 
  • అనధికారంగా విద్యుత్‌ స్తంభాలు ఎక్కడం, ఫ్యూజులు వేయడం చట్టవిరుద్ధమే కాదు ప్రాణాలకు ప్రమాదం. 
  • అధిక సామర్థ్యం గల ఫ్యూజు వైర్లను వాడరాదు. వాటివల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి గృహోపకరణాలు కాలిపోతాయి. 
  • విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పక్కన, విద్యుత్‌ లైన్లు క్రింద తోపుడు బండ్లు, బడ్డీలు పెట్టడం ప్రమాదకరం.

ప్రచార రథాన్ని అందుబాటులోకి తెచ్చాం 
ఏపీ ఈపీడీసీఎల్‌ ముందుగా ప్రచార రథాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. భద్రత సూచనలకు సంబంధించిన ఆడియోలను తయారుచేసి సంస్థ పరిధిలోని అన్ని సెక్షన్‌ కార్యాలయాలకు ఇప్పటికే పంపించాం. ఇకనుంచి ప్రతినెలా 2వ తేదీన క్రమం తప్పకుండా విద్యుత్‌ భద్రతా అవగాహన కార్యక్రమాలను అన్ని జిల్లాల్లోని సెక్షన్‌ కార్యాలయాల్లో నిర్వహించాలని ఆదేశించాం. వినియోగదారులు అవసరమైతే టోల్‌ ఫ్రీ నంబరు 1912కు ఫోన్‌ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. – ఐ.పృధ్వీతేజ్, సీఎండీ, ఏపీ ఈపీడీసీఎల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement