కదిలిన అవినీతి పునాది! | Sakshi
Sakshi News home page

కదిలిన అవినీతి పునాది!

Published Sun, Sep 10 2023 5:36 AM

The Income Tax Department exposed the scams with evidence - Sakshi

సాక్షి, అమరావతి:  మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధానిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో సాగించిన ముడుపుల దందా స్పష్టంగా బయటపడింది. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి రూ.వందల కోట్ల ముడుపులను షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు ఎలా కాజేశారో ఐటీ శాఖ సాక్ష్యాధారాలతో సహా బహిర్గతం చేసింది. డొల్ల కంపెనీల ద్వారా తరలించిన రూ.118.98 కోట్లను లెక్క చూపని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ ఐటీ శాఖ చంద్రబాబుకు తాజాగా నోటీసులు జారీ చేసింది.

46 పేజీల ఆ సుదీర్ఘ లేఖలో నగదును ఏ విధంగా తరలించారు? బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మెసేజ్‌లు, ఎక్సెల్‌ షీట్లు, కోడ్‌ భాషలో రాసుకున్న సంకేతాలను విశదీకరిస్తూ అన్ని సాక్ష్యాధారాలతో మరీ నోటీసులిచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అత్యధిక కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి చెందిన ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి తన వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ను చంద్రబాబు స్వయంగా పరిచయం చేశారు.

పీఎస్‌ శ్రీనివాస్‌ ఎప్పటికప్పుడు అన్ని వివరాలను తనకు చేరవేస్తుంటారని, అతడి ద్వారా తాను సూచనలు చేస్తుంటానని, అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ముడుపులపై మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబుకు ముడుపులు ఏ రూపంలో, ఎలా ఇవ్వాలో ఆయన పీఏ శ్రీనివాస్‌ చెప్పేవారని, లేదంటే తమ బిల్లులు పాస్‌ కాకుండా పెండింగ్‌లో పెట్టేవారని పార్థసాని వాంగ్మూలంలో వెల్లడించాడు. చంద్రబాబుకు రూ.వందల కోట్లను ముడుపులుగా చెల్లించినట్లు మనోజ్‌ పార్థసాని తన వాంగ్మూలంలో ఐటీ శాఖకు తెలియచేశాడు.   

వితండ వాదనతో మళ్లీ నోటీసులు..
మనోజ్‌ పార్థసానికి చెందిన కార్యాలయాలపై 2019లో సోదాలు జరిపిన ఐటీ శాఖ అదే ఏడాది నవంబరు 1, 5వ తేదీల్లో అతడిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2020లో చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపింది. అందులో చంద్రబాబు పాత్రను నిర్ధారించే పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. దీంతో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి.

అయితే తనకు నోటీసులిచ్చే అధికారం మీకు లేదంటూ చంద్రబాబు వితండ వాదన చేయడంతో ఐటీ శాఖ తాజాగా వివిధ చట్టాలను ఉటంకిస్తూ ఆయనకు మళ్లీ నోటీసులిచ్చింది. ఆ నోటీసులతో పాటు మనోజ్‌ పార్థసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా జత చేయటంతో చంద్రబాబు ముడుపుల దందా కళ్లకు కట్టినట్లు వెల్లడైంది. అక్రమంగా రూ.118.98 కోట్లు చంద్రబాబుకు ఎలా చేరాయన్న విషయాన్ని ఐటీ శాఖ స్పష్టంగా ఓ పట్టిక రూపంలో వివరించింది. ఇంత స్పష్టమైన ఆధారాలున్నందున దీన్ని అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొంది.  

పేదల ఇళ్లలోనూ.. 
తాత్కాలిక భవనాల నిర్మాణాల్లో అడ్డంగా దోచేసిన చంద్రబాబు పేదల ఇళ్లను సైతం వదల్లేదు. రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను ఒకే నిర్మాణ రంగ సంస్థకు అప్పగించి భారీ దోపిడీకి వేసిన పథకం ఐటీ నోటీసుల్లో బయటపడింది. ‘ఈడబ్ల్యూఎస్‌’ పథకం కింద పేదలకు ఉద్దేశించిన టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో ముడుపులు కొట్టేసేందుకు ప్రణాళిక వేశారు. ఇదే విషయాన్ని మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని 2019 నవంబర్‌ 5న ముంబైలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో వెల్లడించాడు. తాత్కాలిక సచివాలయం భవనాలే కాకుండా రాష్ట్రంలో వివిధ నిర్మాణాలకు సంబంధించి 2018 డిసెంబర్‌ నాటికి సుమారు రూ.8,000 కోట్ల విలువైన కాంట్రాక్టులను షాపూర్జీ పల్లోంజీకి చంద్రబాబు అప్పగించినట్లు మనోజ్‌ వాసుదేవ్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.

ఇందులో ఈడబ్ల్యూఎస్‌ హౌసింగ్‌ ప్రాజెక్టు కింద సుమారు రూ.7,000 కోట్ల విలువైనవి కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తెలిపాడు. అమరావతిలో రూ.700 కోట్ల హౌసింగ్‌ ప్రాజెక్టును 2019 ఫిబ్రవరిలో కేటాయించారని, దీని తర్వాతే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఇంటికి పిలిచి ఆయన పీఏ శ్రీనివాస్‌తో టచ్‌లో ఉండాలని చెప్పారని, పార్టీ ఫండ్‌ రూపంలో కాకుండా డొల్ల కంపెనీల ద్వారా తనకు నగదు ఇవ్వాలని సూచించినట్లు వాంగూల్మంలో స్పష్టంగా పేర్కొన్నాడు. 2017లో షాపూర్జీ పల్లోంజీ 1.40 లక్షల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకోగా 2019 మార్చి నాటికి కేవలం 23 వేల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసింది.  

లోకేశ్‌కూ అవినీతి సొమ్ము 
ముడుపులు పిండుకోవడంలో ‘చినబాబు’ కూడా చేతివాటం చూపారు. ఈమేరకు చంద్రబాబుకు జారీ చేసిన సుదీర్ఘ నోటీసుల్లో నారా లోకేశ్‌ పేరును కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రస్తావించింది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు, టీడీపీ కార్యదర్శిగా ఉన్న కిలారు రాజేష్‌ అక్రమ నగదు తరలింపులో కీలకపాత్ర పోషించినట్లు ఐటీ శాఖ స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెల్లడించింది. ‘మీ కుమారుడు నారా లోకేశ్‌ సన్నిహితులు నగదు తీసుకున్నారనేందుకు పక్కా ఆధారాలున్నాయి. వీటిపై మీరు ఏం సమాధానం చెబుతారు?’ అని ప్రశ్నిస్తూ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఎక్సెల్‌ షీట్లు, నగదు తరలింపు సమయంలో జరిపిన వాట్సాప్‌ మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ల రూపంలో జత చేసి మరీ నోటీసులను జారీ చేసింది.

విశాఖకు చెందిన ఆర్‌వీఆర్‌ నిర్మాణ రంగ సంస్థకు చెందిన రఘు రేలా ఆయన సన్నిహితుల ద్వారా కూడా భారీ మొత్తాలను తరలించినట్లు సాక్ష్యాలతో స్పష్టం చేసింది. ఈ చాటింగ్‌లన్నీ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్‌ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో సోదాలు జరిపినప్పుడు స్వా«దీనం చేసుకున్న శ్యాంసంగ్‌ ఫోన్‌ నుంచి సేకరించినవి కావడం గమనార్హం. వీటిని శ్రీనివాస్‌ ధృవీకరించినట్లు ఐటీ శాఖ చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజే‹Ùకు రూ.4.5 కోట్లను నగదు రూపంలో ఎలా చేరవేశారో ఐటీ శాఖ పూర్తి సాక్ష్యాధారాలతో నోటీసుల్లో వివరించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీరు ముడుపుల వ్యవహారాన్ని యధేచ్ఛగా కొనసాగించారు. 2019 మే 22న చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణలు దీన్ని ధృవీకరిస్తున్నాయి.

ఆ రోజు చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ డబ్బుల పంపిణీ గురించి ప్రస్తావించగా కిలారు రాజేష్‌కు రూ.4.5 కోట్లను టీడీపీ ఆఫీసులో అందించినట్లు పార్థసాని పేర్కొన్నాడు. అంకిత్‌ బలదూత ద్వారా రూ.2.2 కోట్లు పంపగా, రఘు రేలాకు సన్నిహితుడైన శ్రీకాంత్‌ ద్వారా మిగిలిన మొత్తాన్ని పంపినట్లు చెప్పడంతో ‘‘అయితే ఓకే..’’ అంటూ చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ బదులిచ్చాడు. ఈమేరకు నగదు తరలింపులకు సంబంధించి శ్రీకాంత్‌ ఫోన్‌ నుంచి జరిగిన వాట్సాప్‌ సంభాషణలను కూడా ఐటీ అధికారులు జత చేశారు. వాంగ్మూలం నమోదు సమయంలో ఈ సంభాషణలను మనోజ్‌ వాసుదేవ్‌కు చూపగా అది నిజమేనని అంగీకరించినట్లు ఐటీశాఖ పేర్కొంది. డేటా చౌర్యం ఐటీ గ్రిడ్‌ కేసులో కూడా కిలారు రాజేష్‌ కీలక పాత్రధారిగా వ్యవహరించిన విషయం విదితమే. 

Advertisement
Advertisement