గేల్‌, డివిలియర్స్‌ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్‌ | Gambhir Names Only Batsman He Has Feared Not Gayle De Villiers | Sakshi
Sakshi News home page

IPL: గేల్‌, డివిలియర్స్‌ కాదు.. నన్ను భయపెట్టింది అతడే: గంభీర్‌

Published Fri, May 3 2024 3:43 PM | Last Updated on Wed, May 8 2024 10:40 AM

Gambhir Names Only Batsman He Has Feared Not Gayle De Villiers

టీమిండియా తరఫున రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో భాగమైన గౌతం గంభీర్‌.. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చాలా కాలం పాటు ప్రాతినిథ్యం వహించిన ఈ మాజీ ఓపెనర్‌ ఎన్నో రికార్డులు సాధించాడు.

అంతేకాదు కెప్టెన్‌గా కేకేఆర్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. 2012, 2014 సీజన్లలో ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు గంభీర్‌. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా కెరీర్‌ సాఫీగా సాగకపోవడంతో ఆటకు వీడ్కోలు పలికాడు గౌతీ.

ఈ క్రమంలో గతేడాది లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా వ్యవహరించిన ఈ బీజేపీ ఎంపీ.. తాజా ఎడిషన్‌లో మళ్లీ కేకేఆర్‌ గూటికి చేరాడు. శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.

ఈ నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడిన గౌతం గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో తనకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఆటగాడి పేరు ఈ సందర్భంగా వెల్లడించాడు.

‘‘క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌ కాదు... ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఉన్నపుడు నన్ను భయపెట్టిన ఒకే ఒక్క బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. అతడు బరిలో ఉన్నాడంటే ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ, ప్లాన్‌ సీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి.

ఎందుకంటే రోహిత్‌ శర్మను ఆపడం ఎవరితరం కాదు. అందుకే అతడి కోసం తప్ప మరే ఇతర బ్యాటర్‌ కోసం కూడా నేను ఇన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా మరీ వ్యూహాలు రచించిన సందర్భాలు ఉన్నాయి’’ అని గంభీర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్‌ శుక్రవారం తలపడనున్న తరుణంలో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్‌ ఆడిన తొమ్మిదింట గెలిచి రెండో స్థానంలో ఉండగా.. ముంబై పదింట కేవలం మూడు గెలిచి తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement