పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి | Sakshi
Sakshi News home page

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

Published Fri, Dec 10 2021 5:01 AM

R Krishnaiah Says That BC bill should be introduced in Parliament - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘బీసీ బిల్లు’ పెట్టి బీసీలకు చట్ట సభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బీసీలకు గొర్రెలు–బర్రెలు కాదు, రాజ్యాధికారం కావాలంటూ నినాదాలు చేశారు. నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాసు సురేశ్, గుజ్జ కృష్ణ, లాకా వెంగళ్‌ రావు, లాల్‌ కృష్ణ, గుజ్జ సత్యం తదితరులు ప్రసంగించారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ బిల్లు పెట్టేందుకు వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే సహా 18 పార్టీలు మద్దతు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయన్నారు. బీజేపీ అంగీకరిస్తే ఒక్క రోజులోనే బిల్లు పాసవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

కులగణన డిమాండ్‌తో ఓబీసీ సెమినార్‌..
దేశంలో వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని ఏపీభవన్‌లో బీసీ సంఘాల నేత ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆలిండియా ఓబీసీ సెమినార్‌ నిర్వహించారు. కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, తలారి రంగయ్య, డా.సంజీవ్, రెడ్డెప్ప, అనురాధ, అయోధ్య రామిరెడ్డి, వంగా గీత  హాజరయ్యారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..సామాజిక న్యాయ చరిత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సువర్ణాధ్యాయమన్నారు. బీసీల కోసం అనేక పథకాలు రూపొందించారని, సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎస్సీ–ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న తరహాలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని  డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల్లో 10 సీట్లు బీసీలకు ఇచ్చి పూర్తి ప్రాధాన్యత కల్పించారని వివరించారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement